Share News

రెండు మోటార్ల కథ కంచికేనా?

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:50 PM

మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని 3వ, 5వ మోటార్లను వినియోగంలోకి తేవడం కష్టతరంగా మారింది.

రెండు మోటార్ల కథ కంచికేనా?
ఎంజీకేఎల్‌ఐ పంప్‌హౌస్‌లోని మోటార్లు

- ఉమ్మడి జిల్లాకు కీలకమైన ప్రాజెక్టు ఎంజీకేఎల్‌ఐ

- 2 సార్లు నీటిలో మునిగిన పంప్‌హౌస్‌

- ఐదింటిలో దెబ్బతిన్న రెండు మోటార్లు

- నేటికీ మరమ్మతుకు నోచుకోని పరిస్థితి

నాగర్‌కర్నూల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని 3వ, 5వ మోటార్లను వినియోగంలోకి తేవడం కష్టతరంగా మారింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో దాదాపు 4.65లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు జిల్లాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగు నీరు అందించాల్సి ఉంది. అయితే ఈ పథకం హెడ్‌ వర్క్స్‌ లోని పంపు హౌస్‌లు 2016లో ఒకసారి, 2020 లో మరోసారి నీటి మునగడంతో భారీ నష్టం వాటి ల్లింది. 2020లో పంపు హౌజ్‌ నీటిలో మునిగిపో యినప్పుడు ఒక్కొక్కటి 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 3, 5వ మోటార్లు కాలిపోయాయి. సర్జ్‌ఫూల్‌ నుంచి నీటిని తోడి పంపు హౌజ్‌లోకి పంపించే డ్రాప్ట్‌క్యూబ్‌ వ్యవస్థ దెబ్బతినడంతో వాటిని పునరుద్ధరించే ప్రక్రియ కు విఘాతం కలిగింది. దీంతో మరమ్మతు పనులు చేపట్ట డం ఇబ్బందిగా మారింది.

ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరం

ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఆ రెండు మోటార్లను మరమ్మతు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఎల్లూరులోని 0.35 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నుంచి నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూ బ్‌నగర్‌, వికారాబాద్‌, నల్గొండ జిల్లాలకు మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కేఎల్‌ఐ పంప్‌హౌస్‌లోని 3వ, 5వ మోటార్లను మరమ్మతు చేయాలంటే మిషన్‌ భగీరథకు నీరందించే అవకాశం ఉండదు. దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకోసం పాల మూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లా పూర్‌ రిజర్వాయర్‌ నుంచి మిషన్‌ భగీరథ గ్రిడ్‌కు ప్రత్యేక పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి నీటిని మళ్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మోటార్లను మరమ్మతు చేసే అవకాశం కలుగుతుంది. అప్పటి వరకు ఏమీ చేయ లేని పరిస్థితి నెలకొన్నదని ఎంజీఎల్‌ఐ ఎస్‌ఈ విజయ భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆ రెండు మోటార్ల మరమ్మతులో సందిగ్ధం నెలకొన్నది.

నిలిచిపోయిన పనులు

సాంకేతిక కారణాలకు తోడు, నిధుల కొరతతో నార్లాపూర్‌ నుంచి మిషన్‌భగీరథ గ్రిడ్‌కు ప్రత్యేక స్లూయిస్‌ ఏర్పాటు చేసే ప్రక్రియ పనులు ఏడాది గా నిలిచిపోయాయి. ఈ పనులను పూర్తి చేస్తే సాగు, తాగునీటి సరఫరా సజావుగా సాగే అవ కాశం ఉంటుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మిషన్‌ భగీరథకు అవసరమైన నీటిని ఎల్లూరు రిజర్వాయర్‌ నుంచి తీసుకుంటున్నారు. తాగునీటి అవసరాలు పెరిగిన దృష్ట్యా 6.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి మిషన్‌భగీరథ గ్రిడ్‌కు ప్రత్యేక స్లూయిస్‌ ఏర్పాటు పనులు ముందుకు సాగడం లేదు.

Updated Date - Jul 16 , 2025 | 11:50 PM