Share News

పండుగ పూట పస్తులు తప్పవా?

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:37 PM

తమకు పండు గ పూట కూడా పస్తులు తప్పవా అని కాంటింజెంట్‌, దినసరి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండుగ పూట పస్తులు తప్పవా?
కల్వకుర్తిలో ఆశ్రమ పాఠశాల ముందు నిరవధిక దీక్షలో కూర్చున్న డైలీవేజ్‌ కాంటిజెంట్‌ వర్కర్లు

- 8 నెలలుగా అందని వేతనాలు

- తాత్కాలిక, దినసరి కార్మికుల ఆవేదన

- 12వ తేదీ నుంచి కొనసాగుతున్న సమ్మె

- ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌

కల్వకుర్తి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తమకు పండు గ పూట కూడా పస్తులు తప్పవా అని కాంటింజెంట్‌, దినసరి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్టీ వస తి గృహాల్లో పని చేస్తున్న దినసరి కార్మికులకు 8 నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో పూట గడవడమే కష్టం గా మారిందని వారు వాపోతున్నారు. తాము దాదాపు 20 ఏళ్లుగా పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని చెప్తున్నారు. ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని కోరుతున్నారు. గతంలో వారికి ప్రతీ నెల రూ. 13,240 వేతనం ఇచ్చే వారు. గత ఏడాది జూన్‌ నుంచి ఆ మొత్తాన్ని రూ.11,700కు తగ్గించి ఇస్తున్నారు. అది కూడా 8 నెలలుగా ఇవ్వడం లేదు.

150 మంది కార్మికులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 15 ఆశ్రమ పాఠశాలలు, 9 ఎస్టీ హాస్టళ్లు, 5 కళాశాల వసతి గృహాలు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో 150 మంది దినసరి కార్మికులు పని చేస్తున్నారు. మరో 51 మంది రెగ్యులర్‌ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు భోజనా లు వండి పెట్టడంతో పాటు వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వీరి విధి కాగా, ఉదయం నుంచి రాత్రి వరకు పని ఉంటోంది. కానీ ప్రభుత్వం పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా, ఇస్తున్న వేతనాన్ని తగ్గించిందని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఈనెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, ప్రతీ నెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని, మృతి చెందిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని, పూర్తి కాలం పని చేస్తున్న కార్మికులకు పూర్తి వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌, పలు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించారు.

సమాచారం అందించాం

జిల్లాలోని ఎస్టీ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న దినసరి కార్మికులు సమ్మె చేస్తున్న విష యాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఎస్టీ వసతి గృహాల్లో, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుం టున్నాం.

ఎం.ఫిరంగి, డీటీడీవో, నాగర్‌కర్నూల్‌

Updated Date - Sep 30 , 2025 | 11:38 PM