సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 10:58 PM
యాసంగి పంటలు సాగు చేసిన రైతులు నీటిని పొదుపుగా వాడుకొని పంటలు ఎండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి చెప్పారు.

- వరి పంట ఎండకుండా చూసుకోవాలి
- కలెక్టర్ విజయేంద్ర బోయి
కోయిలకొండ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : యాసంగి పంటలు సాగు చేసిన రైతులు నీటిని పొదుపుగా వాడుకొని పంటలు ఎండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి చెప్పారు. మంగళవారం మండలంలోని శేరివెంకటాపూర్, సంగనోనిపల్లి, జమాల్‌పూర్, కోయిలకొండ గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంటను పరిశీలించారు. చెరు వులు, కాలువల కింద పంట వేసిన రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. బోరుబావుల కింద సాగు చేసిన కొందరి పంట ఎండిపోవడం బాధాకరమన్నారు. సంగినోనిపల్లి సమీపంలో కోయిల్‌సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా చెరువులను నింపేందుకు కృషి చేయాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. జమాల్‌పూ ర్‌లో నర్సరీని పరిశీలించిన కలెక్టర్ మొక్కలు ఎండకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీవీబీని తనఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదుల్లో బల్బులు, స్విచ్‌లు పోతే తాత్కాలిక మరమ్మతులు ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. ఎస్‌వోకు నోటీసీలు ఇవ్వాలని ఎంఈవోను ఆదేశించారు. విద్యార్థులకు కళ్లద్దాల ను అందించారు. సర్వేలో డాటా ఎంట్రీ చేసిన తమకు డబ్బులు రాలేదని యువకులు కలెక్టర్‌కు వినతి పత్రం అందించగా, త్వరలో అందరికీ డబ్బులు వస్తాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజాగణేష్, ఎంపీడీవో హరీశ్‌రెడ్డి, ఏవో యామారెడ్డి, ఎంపీవో నసీ ర్‌అహ్మద్, ఇరిగేషన్ ఏఈ పరుశురాంరెడ్డి తది తరులు పా ల్గొన్నారు.
25 శాతం రాయితీని పొందండి : కలెక్టర్
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : లే అవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్లాట్ల యజమానులు ఈనెల 31లోపు రుసుం చెల్లించి 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి దరఖాస్తు దారులు, ప్లాటు యజమానులు ఏమైన సందేహాలు లేదా వివరాల కోసం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 08542 - 241165, మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థలో హెల్ఫ్‌లైన్ నెంబర్ 7093911352ను సంప్రదించవచ్చని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లేఅవుట్ల క్రమబద్దీకరణ సమాచారం పొందచ్చని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు దారులు వెబ్ సైట్ లాగిన్ ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. 2020 ఆగస్టు 26 నాటికి లేఅవుట్‌లో 10శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే మిగిలిన వాటికి కూడా ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్దీకరణ అవకాశం కల్పించబడిందని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ద్వారా నిర్ణీత నమోనాలో దరఖాస్తులు స్వీకరించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం మునిసిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్దీకరిస్తారని తెలిపారు. చెల్లింపులు చేసిన వారికి 3, 4 రోజుల్లో అనుమతులు మంజూరు చేయబడతాయని తెలిపారు. మునిసిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ ప్రక్రియను ప్రాధాన్యతగా తీసుకొని, లేఅవుట్ ఓనర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, అవసరమైన పత్రాలు అందించనున్నట్లు తెలిపారు.