అంతర్మథనం
ABN , Publish Date - Aug 06 , 2025 | 10:43 PM
రాజకీయాల్లో మార్పులు చాలా వేగంగా జరుగుతుంటాయి. ఒక్క చిన్న పరిణామం ఎంతోమంది నేతలను అంతర్మథనంలోకి నెట్టివేస్తుంది. దానిచుట్టూనే వారు ఆలోచించేలా ప్రేరేపిస్తుంది. రాజకీయాల్లో ఇది జరగదు అనేది ఉండదు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరుగుతున్న చర్చ కూడా అందులో భాగమే.
బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు లేదా విలీనంపై చర్చనీయంగా గువ్వల వ్యాఖ్యలు
ఏ పార్టీతో పొత్తు ఉన్నా తాను కేటీఆర్ వెంటేనని మర్రి నర్మగర్భ ప్రకటన
అదే జరిగితే ఉమ్మడి జిల్లాలో ఎవరెవరు ఏం ఆశిస్తారనే దాక ఊహాగానాలు
మరికొంతమంది నేతలు బీజేపీవైపు వెళ్లే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం
కొన్ని నియోజకవర్గాల్లో బలంగా బీజేపీ నాయకులు, ఎన్నికల్లో ప్రధాన పోటీ
మహబూబ్‌నగర్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాజకీయాల్లో మార్పులు చాలా వేగంగా జరుగుతుంటాయి. ఒక్క చిన్న పరిణామం ఎంతోమంది నేతలను అంతర్మథనంలోకి నెట్టివేస్తుంది. దానిచుట్టూనే వారు ఆలోచించేలా ప్రేరేపిస్తుంది. రాజకీయాల్లో ఇది జరగదు అనేది ఉండదు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరుగుతున్న చర్చ కూడా అందులో భాగమే. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయడం, ఆ సందర్భంలో, ఆ తర్వాత చేసిన పలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగిందని ఇప్పటికే ఒకసారి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించడం, ఎంపీ సీఎం రమేష్ తనను కలిసిన కేటీఆర్ పొత్తుపై మాట్లాడారని ప్రకటించడం, తాజాగా గువ్వల వ్యాఖ్యలు, నాగర్‌కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సైతం ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తాను కేటీఆర్ వెంటే ఉంటానని నర్మగర్భంగా పొత్తుపై స్పందించడం వంటివన్నీ చర్చను, నేతల్లో ఒకరకమైన ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీకి విలీనం మాటలు, పొత్తులు పెట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2004లో కాంగ్రె్‌సతో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రె్‌సలో విలీనం చేసే దిశగా అడుగులు కూడా వేసింది. ఇవన్నీ కారణాల నేపథ్యంలో కొందరు పొత్తు లేదా విలీనం ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల్లో ఉండొచ్చని భావిస్తుండగా మరికొందరు మాత్రం అసలు ఆ ప్రస్తావనే ఉండదంటున్నారు. ఇంకొందరు విలీనమనే మాట ఉండదని, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మాదిరిగా కూటమిగా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులో ప్రధానంగా చర్చ జరుగుతోంది.
అప్పుడే బలాబలాలపై చర్చ..
ఈ పొత్తు ప్రస్తావన తరచూ వస్తుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొందరు నేతలు, సాధారణ ప్రజలు బలాబలాలపై అప్పుడే చర్చ కూడా చేస్తున్నారు. ఇలా జరిగితే అలా జరుగుతుంది. అలా జరిగితే ఇలా జరుగుతుంది అంటూ గుసగుసలాడుతున్నారు. గువ్వల బాలరాజు రాజీనామాతో కొందరు మాజీ మంత్రి రాములు బీఆర్‌ఎ్‌సలోకి వస్తారని అంటుండగా ఇంకొందరు ఆయన బీజేపీలోనే ఉంటారని, ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీచేస్తారని అంటున్నారు. అలా ఉంటే బీఆర్‌ఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు అచ్చంపేట నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ నడుస్తోంది. పొత్తు కుదిరితే అచ్చంపేటలో గందరగోళం ఏర్పడే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. కొల్లాపూర్‌లో ఇప్పటికే బీరం తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఎల్లేని సుధాకర్‌రావు రెండు టర్మ్‌లుగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే జేపీ అడిగే స్థానాల్లో కొల్లాపూర్ ఉంటుందని అంటున్నారు. తర్వాత కల్వకుర్తి నియోజకవర్గంలో అచారి బీజేపీ నుంచి అలుపెరగని యోధుడులా పోటీ చేస్తున్నారు. పొత్తు విషయం వస్తే మొదట అడిగే సీటు కూడా ఇదే. దీంతోపాటు గద్వాల, మక్తల్ లేదా నారాయణపేటలో ఒకటి, మహబూబ్‌నగర్ బీజేపీ అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే షాద్‌నగర్ కూడా కోరవచ్చు. మొత్తం 14 స్థానాలు ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరు స్థానాల వరకు బీజేపీ కచ్చితంగా వదులుకోదనే చర్చ నడుస్తోంది. అసలు పొత్తు విషయమే ఊహాగానం అయినప్పటికీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా కవిత వ్యతిరేక గళం, బాలరాజు వ్యాఖ్యలు వంటి పరిణామాలు చోటుచేసుకోవు కదా అని ముక్తాయిస్తున్నారు.
బలంగా బీఆర్‌ఎస్ కేడర్..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు దక్కకపోయినా బీఆర్‌ఎస్ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నదనేది సుస్పష్టం. ఉద్యమకాలం మొదలుకొని పదేళ్లు ప్రభుత్వం ఉండటంతో పార్టీకి సాధానాసంపత్తి, నాయకత్వ సమస్య పెద్దగా లేదనే చెప్పాలి. బాధ్యతలు అప్పగిస్తే పనిచేయడానికి చాలామంది పోటీపడుతున్నారు. కిందివరకు నమ్మకమైన కేడర్ ఉండగా తాజా గడ్డు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పొత్తు లేదా విలీనం చేయదనే అభిప్రాయం కూడా వస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఒక ముఖ్యనేత తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా తిరిగి బలోపేతం కావాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉండగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో ఓటు బ్యాంకు విషయంలో నిలిచాయి. ఎలాగూ జమిలి ఎన్నికల ఆంశంపై కేంద్రం ఆలోచన చేస్తుండటం, జనగణన తర్వాత నియోజకవర్గాల పెంపు ఉండటం, పొత్తు జరిగినా పెద్దగా చిక్కులు లేకుండా టిక్కెట్ల కేటాయింపులు చేసుకొని ముందుకువెళ్తే ఎంపీల విషయంలో బీజేపీ ఓటుబ్యాంకు, ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్ర కోణంలో బీఆర్‌ఎస్ ఓటుబ్యాంకు ద్వారా మంచి ఫలితాలు ఉండవచ్చనే భావన కూడా వస్తోంది. ప్రస్తుత స్థితిలో పొత్తు విషయంలో నిర్దిష్ట నిర్ణయం వెలువడే అవకాశం లేదు. ఎన్నికల నాటివరకు ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది.