పంచాయతీ బకాయిలపై ఇంటలిజెన్స్ ఆరా!
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:31 PM
గ్రామ పంచాయతీల బకాయిలపై ఇంటలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది.
- గ్రామాల్లో 22 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన
- పారిశుధ్య నిర్వహణకు కార్యదర్శుల అవస్థలు
- రూ. 3 నుంచి రూ. 5 లక్షల అప్పులు
- బకాయిల సమాచారం ఇచ్చాం : డీపీవో భాగం నిఖిలశ్రీ
మహబూబ్‌నగర్ న్యూటౌన్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీల బకాయిలపై ఇంటలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరు కాని బిల్లుల వివరాలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్య నిర్వహణ, ఇతర పనుల కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రైవేటుగా తెచ్చిన అప్పుల వివరాలను సేకరిస్తోంది. పూర్తి వివరాలతో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు గత మూడు రోజులుగా అన్ని మండల పరిషత్ కార్యాలయాలు, డీపీవో కార్యాలయంలో వివరాలను సేకరించారు. ఇంటలిజెన్స్ విభాగం పంపిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
కేంద్రం నుంచి విడుదల కాని నిధులు
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం 2023 డిసెంబరులో పూర్తయింది. అప్పటి నుంచి గ్రామాలు ప్రత్యేక అఽధికారుల పాలనతో కొనసాగుతున్నాయి. దీంతో పంచాయతీల నిర్వహణ బాధ్యత మొత్తం గ్రామ పంచాయతీ కార్యదర్శులపై పడింది. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా నిధులు సమకూర్చలేదు. దీంతో కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు, ఇతర పనులు చేపట్టాల్సి వచ్చింది. గ్రామ జనాభాను బట్టి ఒక్కో కార్యదర్శి రూ.3 నుంచి రూ. 5 లక్షల వరకు అప్పులు తెచ్చి ఖర్చు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 16 మండలాల్లో ఉన్న గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతీ సంవత్సరం రూ. 48 కోట్లు రావాల్సి ఉంది. సగటున మనిషికి ప్రతీ నెల రూ. 806 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తాయి. ఈ లెక్కన 22 నెలలకు రూ. 95 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది.
సమాచారం అందించాం
భాగం నిఖిలశ్రీ, డీపీవో : జిల్లాలోని 16 మండలాల పరిధిలోని గ్రామాల్లో బకాయిల వివరాలను ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కు అందించాం. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులు వ్యక్తిగత రుణాలు తెచ్చి నిర్వహిస్తున్నారు. దీంతో వారు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.