పరిశ్రమలతో వ్యవసాయ రంగానికి ప్రమాదం
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:38 PM
పాలమూరు జిల్లాకు వస్తున్న పరిశ్రమలతో వ్యవసాయ రంగానికి ప్రమాదం పొంచి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు.
రాంనగర్, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు జిల్లాకు వస్తున్న పరిశ్రమలతో వ్యవసాయ రంగానికి ప్రమాదం పొంచి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేసే పరిశ్రమలకు అనుమతులిస్తూ కార్పొరేట్ కంపెనీల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. అనారోగ్యాన్ని తీసకొస్తున్న పాలకుల తీరుకు వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రజా సంఘాలతో ప్రజా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల జీవనంపై జరిగిన సదస్సులో పలువురు ప్రముఖులు హెచ్‌సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం, పర్యావరణ వేత్త చంద్రశేఖరశర్మ తదితరులు మాట్లాడారు. వ్యవసాయ ఆ ధారిత రంగాలకు నీటి వనరుల పంపిణీ సరగ్గా లేక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగే పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ అభివృద్ధి అని చెప్పుకోవడం శోచనీయమన్నారు. పాలమూరులో కల్తీ కల్లు రాజ్య మేలుతుందని ఆరోపించారు. పాలమూరు నీటి వనరులు అక్కడి ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు నిరాకరిం చాలన్నారు. పాలమూరుకు వచ్చే పరిశ్రమలన్నీ వ్యవసాయాన్ని నాశనం కోరే పరిశ్రమలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎం.కోదంరాం మాట్లాడుతూ పాలమూరు జిల్లా అభివృద్ధికి ఈ సదస్సులో చర్చించిన అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. శాస్త్రవేత్త బాబురావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, రాజేంద్రబాబు, చంద్రశేఖర్, తిమ్మప్ప, రెహ్మన్, వేణుగోపాల్ పాల్గొన్నారు.