ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:01 PM
జిల్లాలో నిర్ధే శించిన లక్ష్యం ప్రకారం ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేటటౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్ధే శించిన లక్ష్యం ప్రకారం ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ హౌసింగ్, డీఆర్డీఏ, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, పీఆర్, డీపీవో, మునిసిపల్ శాఖల అధికారులతో ఆయా శాఖల ప్రగతి పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సొంత స్థలాలు ఉన్న 859 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని వాటిలో ఇంతవరకు ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయని అడిగారు. స్పందించిన హౌసింగ్ పీడీ శంకర్ ఇప్పటివరకు 165 గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. సెర్ప్‌కు సంబంధించి మహిళలకు సోలార్ పవర్ ప్లాంట్లు, బస్సులు, న్యూఎంటర్ ప్రైజెస్ ఎంతవరకు వచ్చాయని కలెక్టర్ డీఆర్డీవో మొగులప్పను అడిగి తెలుసుకున్నారు. అయితే బ్యాంక్ లింకేజీలో రాష్ట్రంలో మన జిల్లా ర్యాంకు 32వ స్థానంలో ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పనితీరు సరిగ్గా లేని ఏపీఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డీఆర్డీవోను ఆదేశించారు. 2025-26 సంవత్సరానికి స్కూల్ యూనిఫాంలు కుట్టే ప్రక్రియపై ఆమె చర్చించారు. 2024-25లో జరిగిన పొరపాట్లు, లోటుపాట్లు పునరావృతం కావొద్దని డీఆర్డీఏ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆమె సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఆఽధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన రోడ్లు, భవనాలు, అంగన్ వాడీ కేంద్రాల వివరాలను కలెక్టర్ పీఆర్ ఈఈ హీర్యానాయక్‌ను అడిగి వెంటనే మిగిలిన పనులను పూర్తి చేయాలన్నారు. పదో తరగతి పరీక్ష ఏర్పాట్లు, బాబుజీ జాతర పనులు, ఆస్తి పన్ను, ఎల్‌ఆర్‌ఎస్, ఈజీఎస్ పనుల గురించి శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, డీఈవో గోవిందరాజులు, జీసీడీవో నర్మద, డీపీవో సుధాకర్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ బోగేశ్వర్లు పాల్గొన్నారు.