వడ్డెర బస్తీలో.. తాగునీరు కలుషితం
ABN , Publish Date - May 12 , 2025 | 11:18 PM
మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 13వ వార్డు బండమీదిపల్లిలో గల వడ్డెర బస్తీ కాలనీలో మినీ వాటర్ ట్యాంకుకు నీరు సరఫరా చేసే వాల్ వద్ద మురుగు నీరుతో నిండుకుంది.
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
- మినీ ట్యాంకు చుట్టూ బురదమయం
మహబూబ్‌నగర్ న్యూటౌన్, మే 11 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 13వ వార్డు బండమీదిపల్లిలో గల వడ్డెర బస్తీ కాలనీలో మినీ వాటర్ ట్యాంకుకు నీరు సరఫరా చేసే వాల్ వద్ద మురుగు నీరుతో నిండుకుంది. ఇక్కడ నీరు వృథాగా పారడంతో పందులు, కుక్కలు ఎండవేడికి ఆ నీటిలో సేద తీరుతున్నాయి. అదే నీటిని వాటర్ ట్యాంకుకు సరఫరా చేయడంతో వడ్డెర బస్తీ ప్రజలు మురుగు కలిసిన నీరును తాగలేక ఇబ్బందులు పడుతున్నారు. వాల్ వద్ద పరిస్థితి ఇలా ఉంటే.. మినీ వాటర్ ట్యాంకు వద్ద పరిస్థితి మరి దాఽరుణంగా ఉంది. అక్కడ నల్లాలకు ఆన్‌ఆఫ్ సిస్టమ్‌లు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల అక్కడ అంతా మురుగు నీరు పారుతుంది. దీంతో ఆ ప్రాంతమంతా కంపచెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో కాలనీ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి నీటివాల్ వద్ద గుంతలు లేకుండా నిర్మాణం చేపట్టాలని, వాటర్ ట్యాంక్ చుట్టూ ఎత్తైన దిమ్మెను నిర్మించి నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని వడ్డెర బస్తీ ప్రజలు కోరుతున్నారు.