Share News

నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో... గట్టు బ్లాక్‌కు 5వ స్థానం

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:35 PM

నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో జాతీయ స్థాయిలో గట్టు బ్లాక్‌కు 5వ స్థానం దక్కించుకున్నదని జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో... గట్టు బ్లాక్‌కు 5వ స్థానం
సమావేశంలో మాట్లాడుతున్న గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • భవిష్యత్తులో 100 శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలి

  • జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో జాతీయ స్థాయిలో గట్టు బ్లాక్‌కు 5వ స్థానం దక్కించుకున్నదని జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. భవిష్యత్తులో అగ్రస్ధానం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 2024-25 క్యూ4 డెల్టా ర్యాంకింగ్‌లో గట్టు బ్లాక్‌ దేశంలో 5వ స్థానం, జోన్‌-3లో 2వ స్థానాన్ని సాధించిందని తెలిపారు. ఈ విజయానికి గుర్తింపుగా గట్టు బ్లాక్‌కు నీతి అయోగ్‌ నుంచి కోటి రూపాయల పురస్కారం దక్కింద న్నారు. ఈ విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన గట్టు మండల అధికారులు, విభాగాధిపతులు, ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో 100 శాతం కేఐపీ లక్ష్యసాధన కోసం ఇదే అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే ఆరోగ్య శాఖకు సహకరిస్తున్న ఎస్‌బీఐ సంజీవని, భవిష్యభారత్‌, టీచ్‌ ఫర్‌ చేంజ్‌, ఎంవీ ఫౌండేషన్‌ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం గట్టు బ్లాక్‌ కంపోజిట్‌ స్కోర్‌ 69.43గా ఉందని, దానిని మరింత మెరుగుపరిచి 100 శాతం లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, డీపీవో నాగేంద్రం, జిల్లా సంక్షేమాధికారి సునంద, ఎంపీడీవో చెన్నయ్య, ప్రోగ్రాం అధికారి సంధ్యారాణి, అస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ అఫ్జల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:35 PM