పిల్లలు కావాలని వెళితే... మందుల్లేని రోగాన్ని అంటగట్టారు
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:21 PM
వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కావడం లేదని ఓ వ్యక్తి సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్తే, లేని రోగాన్ని అంటగట్టారు.
- హెచ్‌బీఎస్‌ఏజీ లేకున్నా ఉన్నట్లు రిపోర్టు
- వివేక్ గ్యాస్ట్రో ఆసుపత్రి ప్లాస్మా ల్యాబ్ నిర్వాకం
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) అక్టోబర్ 14 (ఆంధ్రజ్యోతి) : వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కావడం లేదని ఓ వ్యక్తి సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్తే, లేని రోగాన్ని అంటగట్టారు. అది హెచ్‌బీఎస్‌ఏజీ (హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటిజన్) పాజిటివ్ అని తేల్చారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన అతడు ఆ రిపోర్టుపై నమ్మకం లేక, మరో ప్రైవేటు ల్యాబుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్‌లో కూడా పరీక్ష చేయించుకోవడంతో నెగటివ్ అని తేలింది.
మహబూబ్‌నగర్ జిల్లా, హన్వాడ మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన రాజుకు వివాహమై ఎనిమిదేళ్లయినా పిల్లలు కలుగలేదు. దీంతో జిల్లాకేంద్రంలోని వివేక్ గ్యాస్ట్రో ఎంటాలజీ ఆసుపత్రిలో ఉన్న టీనా సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లారు. అన్ని పరీక్షలు చేసి, ఆయనకు హెచ్‌బీఎస్‌ఏజీ (హెపటైటిస్-బి) వ్యాధి ఉన్నట్లు రిపోర్టులు ఇచ్చారు. అంతేకాకుండా డాక్టర్ నితీష అతడి భార్యను పిలిచి, అతడికి భయంకరమైన వ్యాధి సోకిందని, శారీరకంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఈ వ్యాధికి తమ ఆసుపత్రిలోనే చికిత్స ఉందని, రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే ఆ రిపోర్టులపై నమ్మకం లేని రాజు, హైదరాబాద్‌లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, అపోలో ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ సెంటర్‌లలో హెచ్‌బీఎస్‌ఏజీ పరీక్ష చేయించగా, నెగటివ్ రిపోర్టు వెచ్చింది. చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటర్లోనూ పరీక్ష చేయించగా అక్కడ కూడా నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో టీనా సంతాన సాఫల్య కేంద్రంలో తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లు నిర్ధారించుకున్నాడు.
డబ్బులు దండుకోవడానికే..
హెచ్‌బీఎస్‌ఏజీ వ్యాధికి మందులు లేవు. నయం అయ్యే అవకాశం కూడా లేదు. శారీరకంగా కలిస్తే వారికి కూడా భాగస్వామికి కూడా సోక ప్రమాదముంది. అయితే కొన్ని రకాల మందులు, వ్యాక్సిన్లతో వ్యాధి వైరస్ వృద్ధి చెందకుండా సాధారణ స్థితిలో ఉండేందుకు వీలవుతుంది. ఇదే అవకాశంగా భావించిన ఆసుపత్రి యాజమాన్యం, తప్పుడు రిపోర్టు ఇచ్చి, డబ్బులు దండుకునేందుకు సిద్ధమైందని బాధితులు ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
లేనిపోని రోగాన్ని అంటగట్టి నన్ను, నా భార్యను మానసిక క్షోభకు గురిచేశారు. ఈ అవమానంతో ఏదైనా చేసుకుంటామనే భయానికి లోనయ్యాము. ఇదే పరిస్థితి మరెవరికీ రావొద్దనే ఉద్దేశంతో మేము బయటికి వచ్చి వారి నిర్వాకాన్ని బయట పెట్టాం. వారిని వదిలే ప్రసక్తే లేదు. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి.
- రాజు, బాధితుడు