కుట్రలు, కుతంత్రాలు చేస్తే సస్పెండ్ చేస్తా
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:47 PM
కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా.. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు అని జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి హెచ్చరించారు.
- డీసీసీ ఆఫీసుకు వచ్చినవారే అసలైన నాయకులు
- పనితీరును బట్టి బీ ఫారాలు ఇస్తా
- విలేకరుల సమావేశంలో జోగుళాంబ గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి
గద్వాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా.. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు అని జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డీసీసీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇంతకుముందు ఒకలెక్క.. ఇప్పుడు ఒకలెక్క, ఇక్కడ డీసీసీ కార్యాలయం ఉంది. ఇక్కడికి వచ్చిన వారే నిజమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అని అన్నారు. ఆరు నెలల ముందు.. ఏడాది ముందు పార్టీలోకి వచ్చిన వారు నాదే నడవాలంటే కుదరదు అన్నారు. పాతవారు కావాలి.. కొత్తవారు కావాలని తేల్చిచెప్పారు. కార్యక్రమాలకు బొట్టుపెట్టి పిలవడం ఉండదన్నారు. ఇక్కడ నేను డీసీసీ అధ్యక్షుడిని నేను చెప్పిందే మీరు చేయాలి మీ మాటలను గౌరవిస్తాను పాటించాలనే రూల్ పెట్టుకోను అని ఖరాకండిగా చెప్పారు. కాదు, కూడదు అని కుట్రలు, కుతంత్రాలు పన్నితే వారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. మీరు ఎవరికైనా చెప్పుకోండి నేను ఖర్గే ద్వారా నియామకం అయిన వ్యక్తిని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తి కాబట్టే ఆ లైన్‌లోనే పోతానని అన్నారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు కష్టపడుతున్నారో చూస్తున్నాను అన్నారు. బీ ఫారాలు ఇచ్చేది తానేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాత్రమే ఉంటుందని ఒక వ్యక్తి పేరుతో కార్యాలయం ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన ప్రస్థానం ఉందని, ఎంతో మంది పార్టీ కోసం పనిచేశారని అన్నారు. దేశాభివృద్ధి కోసం పనిచేసిన కాంగ్రెస్ నాయకుల పేర్లను చెరిపేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి వెంకటేశ్ ముదిరాజ్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.