డబ్బులు వసూలు చేస్తే తాట తీస్తా
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:13 PM
ప్రభుత్వం పేదోడి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని, అర్హులైన లబ్ధిదారుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడితే తాట తీస్తానని ఎమ్మెల్యే జీమధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఇందిరమ్మ ఇళ్ల పేరిట వసూళ్లకు పాల్పడొద్దు
- ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి
చిన్నచింతకుంట, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం పేదోడి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని, అర్హులైన లబ్ధిదారుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడితే తాట తీస్తానని ఎమ్మెల్యే జీమధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఎంఎస్ గార్డెన్‌లో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని, నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. అవసరమైతే అర్హులందరికీ మరిన్ని ఇళ్లు మంజూరు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. హౌసింగ్ పీడీ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, కురుమూర్తి ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి, శివకుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, రంజిత్‌కుమార్, రాఘవేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, కృష్ణకుమార్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఏదులాపూర్ కొండారెడ్డి పాల్గొన్నారు.