సమయానికి బస్సు ఆపి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:35 PM
రోడ్డుపై నిలుచున్న నర్సింగ్ విద్యార్ధినులకు వచ్చిన బస్సు సమయానికి ఆపి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవని, తమ స్నేహితులు తమతో హ్యాపీగా ఉండేవారని నర్సింగ్ కళాశాల విద్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఒకే కళాశాల ... రెండు చోట్ల చదువులు
- సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ చాంబర్ ముందు బైఠా యించిన విద్యార్థినులు
గద్వాల క్రైం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): రోడ్డుపై నిలుచున్న నర్సింగ్ విద్యార్ధినులకు వచ్చిన బస్సు సమయానికి ఆపి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవని, తమ స్నేహితులు తమతో హ్యాపీగా ఉండేవారని నర్సింగ్ కళాశాల విద్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై వివరిస్తూ... బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ చాంబర్ ముందు విద్యార్ధిఽనులు బైఠాయించి న్యాయం కావాలని గొంతెత్తి అరిచారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. కళాశాల వదిలాక ఆ రూట్‌లో వచ్చే బస్సులు ఆపకపోవడంతోనే తమ స్నేహితులు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. సమయానికి బస్సు ఆపరు... ఒకవేళ ఆపినట్లే ఆపి వెంటనే ముందుకు తీసుకెళ్లారన్నారు. ఒకవేళ బస్సులు ఆపినా కూడా అక్కడ ఉన్న కండక్టర్లు, డ్రైవర్లు ‘మీకు హాస్టల్ దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్తే ఏమవుతుంది...? మీకు ఒళ్లు బరువెక్కుతుందా?’ అంటూ ఇబ్బందులు పెడుతున్నారని కన్నీటి పర్వంతమయ్యారు. నర్సింగ్ కళాశాల ఉన్నప్పటికీ ఒకటి గంజిపేట కాలనీ సమీపంలో మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి పాఠాలు చెబుతున్నారన్నారు. పాత ఎస్పీ కార్యాలయం దగ్గర మూడవ, నాల్గవ సంవత్సరం పాఠాలు చెబుతుండటంతో అక్కడి నుంచి హాస్టల్స్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందిన నర్సింగ్ విద్యార్ధినుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్ధినికి మెరుగైన చికిత్సను అందించాలన్నారు. నర్సింగ్ కళాశాల హాస్టళ్లను, కాలేజీని ఒకేచోట ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, బస్సులు సకాలంలో ఆపాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌తో మాట్లాడేందుకు పట్టణ, రూరల్ ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్‌లు చర్యలు తీసుకోవడంతో కొందరు విద్యార్ధినులు వెళ్లి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జూలై నాటికి హాస్టల్, కళాశాల ఒకేచోట ఉండేలా చూస్తామని, ప్రస్తుతం ఆర్డీసీ డీఎంతో మాట్లాడి బస్సులు ఆగేలా చూస్తామని, మృతి చెందిన విద్యార్ధినుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో నరేందర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.