Share News

కేసీఆర్‌పై ఈగ వాలినా రాష్ట్రం అతలాకుతలం

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:11 PM

కేసీఆర్‌పై ఈగవాలినా రాష్ట్రం అంతా అతలాకుతలం అయితదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌పై రేవంత్‌ సర్కార్‌ చేస్తున్న సీబీఐ కుట్రలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలకు వ్యతిరేకంగా మంగళవారం జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయం ముందు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో లక్ష్మారెడ్డి పాల్గొని, మాట్లాడారు.

కేసీఆర్‌పై ఈగ వాలినా రాష్ట్రం అతలాకుతలం
ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి లొసుగులూ దొరకలేదు

ఇబ్బందులకు గురిచేసేందుకే సీబీఐకి అప్పగింత

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి

జడ్చర్ల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌పై ఈగవాలినా రాష్ట్రం అంతా అతలాకుతలం అయితదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌పై రేవంత్‌ సర్కార్‌ చేస్తున్న సీబీఐ కుట్రలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలకు వ్యతిరేకంగా మంగళవారం జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయం ముందు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో లక్ష్మారెడ్డి పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా విచారణ చేపట్టినా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి లొసుగులు దొరకలేదన్నారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలన్న లక్ష్యంతోనే రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని కేసును సీబీఐకి అప్పగించారని ఆరోపించారు. సీబీఐ, ఈడీలు కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారని, ఇదంతా రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, బీజేపీల కుట్ర అని అన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముంచేకుట్రలో భాగంగానే కేసీఆర్‌పై కేసు నమోదు చేశారన్నారు. మా నీళ్లు మాకు కావాలనే నినాదంతోనే కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలతో తెలంగాణ రాష్ట్రం బాగుపడేలా ఉందన్న నెపంతో బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలోనే రూ.2.20 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని ఆరోపించారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కాదని, ట్రబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లని, రాష్ట్రంలో జాతీయ పార్టీ అధికారంలో ఉండకూడదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడిందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, కోడ్గల్‌ యాదయ్య, పిట్టలమురళి, దోరేపల్లి లక్ష్మీ, ప్రణీల్‌చందర్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:11 PM