రైతులందరికీ గుర్తింపూ కార్డులు
ABN , Publish Date - May 19 , 2025 | 11:30 PM
చిన్న, పెద్ద కంపెనీల్లో పని చేసే వారికి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ గుర్తింపు కార్డులుంటాయి. కానీ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం ఏ గుర్తింపు లేకుండా పోయింది.
ఐడీ కార్డులున్న వారికే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు
ఆత్మకూరు, మే 16 (ఆంధ్రజ్యోతి) : చిన్న, పెద్ద కంపెనీల్లో పని చేసే వారికి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ గుర్తింపు కార్డులుంటాయి. కానీ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం ఏ గుర్తింపు లేకుండా పోయింది. అందుకే ప్రతీ రైతుకు గుర్తింపు కార్డు (ఫార్మర్ ఐడీ కార్డు) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో వివరాలు నమోదు చేసుకొని గుర్తింపు కార్డు తీసుకోవాలని సూచిస్తోంది. గుర్తింపు కార్డులున్న రైతులకే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని చెప్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా పాస్‌బుక్ ఉన్న రైతులందరికీ ఏడాదికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. పథకాన్ని వర్తింప చేసేందుకు రైతులందరూ గుర్తింపు పొంది ఉండాలని సూచిస్తోంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు.
మరిన్ని సంక్షేమ పథకాలు
రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కిసాన్ సమ్మాన్ యోజనతో పాటు, ఫసల్ బీమా యోజన, సబ్సిడీపై ఎరువులు, విత్తనాల పంపిణీ, జల సమృద్ధి యోజన తదితర పథకాలను అమలు చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఫార్మర్ ఐడీ కార్డులు అందించాలని నిర్ణయించింది. అందుకోసం రైతులం దరూ గుర్తింపు పొందాలని సూచిస్తోంది. అందుకోసం రైతులు పట్టాదారు పాస్ బుక్, ఖాతా, ఆధార్ కార్డులకు సంబంధించిన కాపీలతో వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా, రైతు బీమా, బోనస్ వంటి పథకాలు వర్తించవేమో అని రైతులు అపోహలకు గురవుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధం ఉండదని, గుర్తింపు పొందిన ప్రతీ రైతుకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అధికారులు చెప్తున్నారు.
జిల్లాలో 2.80 లక్షల సాగు భూమి
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 2.80 లక్షల ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన కిసాన్ సమ్మాన్, రైతు భరోసా తదితర పథకాల వర్తింపు లెక్కల ప్రకారం 1.90 లక్షల మంది రైతులు పట్టాదారు పాస్‌బుక్ కలిగి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మండలాల వారీగా పదుల సంఖ్యలోనే రైతులు గుర్తింపు పొందారు. మరో రెండు వారాల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. దీంతో రైతులందరూ గుర్తింపు పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పించాల్సి ఉంది. ఆత్మకూరు మండలంలోని జూరాల, మూ లమల్ల, ఆరేపల్లి క్లస్టర్లలో ఇప్పటివరకు 500 మంది కిపైగా రైతులు గుర్తింపు పొందినట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. రైతులందరూ వివరాలు సమర్పించి గుర్తింపు కార్డులు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వెంటనే ఐడీ కార్డు తీసుకుంటా
కేంద్ర ప్రభుత్వం రైతులను గుర్తిస్తూ ఫార్మర్ ఐడీ కార్డులు ఇవ్వడం శుభపరిణామం. ఇప్పటికే కిసాన్ సమ్మాన్ యోజన వర్తిస్తోంది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న మరిన్ని సంక్షేమ పథకాల కోసం గుర్తింపు కార్డు ఉపయోగపడుతుంది. అందుకోసం నేను వెంటనే గుర్తింపు కార్డు తీసుకుంటాను.
- కుమార్, రైతు, జూరాల
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
ప్రతీ ఒక్కరు ఫార్మర్ ఐడీ కార్డులు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించాం. మరోసారి సదస్సులు నిర్వహిం చేందుకు చర్యలు తీసుకుంటాం. ఫార్మర్ ఐడీ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. అందుకే రైతులందరూ మొబైల్ నెంబర్ జతపరిచిన ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ బుక్, బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో వివరాలను నమోదు చేసుకోవాలి.
- వినయ్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి, ఆత్మకూరు