ఆదర్శం.. ఉడుగులగడ్డ తండా
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:17 PM
మండలంలోని కూరగాయల సాగు చేసే రైతులు తక్కువగా ఉన్నప్పటికీ.. వేముల గ్రామ పంచాయతీ ఉడుగులగడ్డతండా రైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
- తండా మొత్తం కూరగాయల సాగే
- వారాంతపు సంతలో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్న తండావాసులు
మిడ్జిల్, జూలై 2: (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కూరగాయల సాగు చేసే రైతులు తక్కువగా ఉన్నప్పటికీ.. వేముల గ్రామ పంచాయతీ ఉడుగులగడ్డతండా రైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలో మొత్తం 200 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేస్తుండగా.. ఉడుగులగడ్డతండాలో మాత్రం ప్రతీ ఒక్కరూ కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖ అధికారులతో పంటల సాగు గురించి ఆరా తీస్తూ అందుకు చేపట్టాల్సిన అంశాల గురించి తెలుసుకొని ముందుకు సాగుతున్నారు. తండాలో మొత్తం 8 కుటుంబాలు, 40 మంది ఉన్నప్పటికీ 30 ఎకరాల్లో టమాట, చిక్కుడు, దోస, కీరా, మిరప, సోరకాయ, బీరకాయ, వంకాయ, బెండ, గోకరకాయ, కొత్తిమీర, పాలకూర, తోటకూరతో పాటు పలు ఆకుకూరలు సాగుచేస్తుంటారు. పందిరిజాతి కూరగాయల పంటలను సాగు చేసేందుకు రాతి కడీలతో పందిర్లు సైతం ఏర్పాటు చేశారు. సాగు చేసిన కూరగాయలు దగ్గరలో ఉన్న వారాంతపు సంతలో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.