భార్యపై కోపంతో రోడ్డుపై బైఠాయించిన భర్త
ABN , Publish Date - May 22 , 2025 | 11:17 PM
భార్య తన మాట వినడంలేదని ఓ భర్త జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు వద్ద 44 నెంబరు జాతీయ రహదారిపై గురువారం బైఠాయించి హంగామా చేశాడు.
- వీడియోకాల్ చేసి హంగామా
- తనపై నుంచి వాహనాలు వెళ్లాలంటూ గగ్గోలు
అలంపూరు చౌరస్తా, మే 22 (ఆంధ్రజ్యోతి) : భార్య తన మాట వినడంలేదని ఓ భర్త జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు వద్ద 44 నెంబరు జాతీయ రహదారిపై గురువారం బైఠాయించి హంగామా చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌భల్లాపూర్‌కు చెంది న రవి అనే లారీడ్రైవర్ వృత్తిరీత్యా హైదరాబాదు వైపు వెళుతుం డగా పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలోకి వచ్చే సరికి తన భార్య తో ఫోనులో గొడవపడ్డాడు. తన మాట వినడంలేదని జాతీయ రహదారిపై బైఠాయించి భార్యకు వీడియోకాల్ చేసి హంగామా చేశాడు. తాను చనిపోతానని, తనపై నుంచి వాహనాలు వెళ్లా ల్సిందిగా గగ్గోలు పెట్టాడు. ద్విచక్ర వాహనదారులు గమనించి అతడికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకూ వినకపోవడంతో లాక్కొచ్చి రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. అరాతీస్తే తాను రెండు లారీలకు ఓనర్‌ను అని, తనది ప్రేమ వివాహమని, తనకు ఏడా ది వయస్సుగల కూతురు ఉన్నదని, భార్యతో తనకు సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు స్థానికులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు.