సమస్యలకు నిలయం.. న్యూ బాలాజీనగర్
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:45 PM
నగరపాలక సంస్థ పరిధిలోని న్యూ బాలాజీనగర్ సమస్యలకు నిలయంగా మారింది.
- రోడ్డుకిరువైపులా పెరిగిన కంపచెట్లు
- చీకటైతే మందు బాబుల వీరంగం
- రోడ్డు నిర్మాణానికి అడ్డుపడుతున్న పొలం యజమాని
మహబూబ్‌నగర్ న్యూటౌన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : నగరపాలక సంస్థ పరిధిలోని న్యూ బాలాజీనగర్ సమస్యలకు నిలయంగా మారింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాలనీలో కొన్ని ప్రాంతాల్లోనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. కాలనీ చివరన ఉన్న ఇళ్ల వరకు సీసీ నిర్మించలేదు. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు రోడ్డుకు ఇరువైపులా జంగిల్ కటింగ్ చేయకపోవడంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయని వాపోతున్నారు. కాలనీకి రోడ్డు నిర్మించడానికి పలుమార్లు నగరపాలక సంస్థ అధికారులు పరిశీలించినప్పటికీ నేటికీ రోడ్డు నిర్మించలేదు. రోడ్డు నిర్మాణానికి స్థానికంగా ఉన్న వ్యవసాయ పొలం యజమాని అడ్డం పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టా పొలం ఉంటే గతంలో బీటీ నిర్మాణానికి ఎలా అనుమతించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థలం యజమానితో నగరపాలక సంస్థ అధికారులు మాట్లాడి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. దీనికి తోడు రాత్రి వేళ మందుబాబులకు అడ్డాగా మారిందని, పోలీసులు రాత్రి వేళలో గస్తీ నిర్వహించాలని పోలీసు శాఖను మొరపెట్టుకుంటున్నారు.