చేనేత కార్మికులకు చేయూత
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:15 PM
చేనేత కార్మికులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
- లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేసేందుకు చర్యలు
- జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 2,100 మంది కార్మికులు, రూ. 6 కోట్ల రుణాలు
- అర్హుల గుర్తింపునకు అధికారుల కసరత్తు
అయిజ, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : చేనేత కార్మికులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అప్పుల పాలైన చేనేత కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా రుణమాఫీ అమలు చేయనున్నది. అందుకోసం రూ. 33 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. దీంతో రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికులను గుర్తించేందుకు గత 10 రోజులుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2017 సంవత్సరం ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు రుణాలు పొందిన వారి జాబితాను సేకరించారు. చేనేత, జౌళిశాఖ జిల్లా అధికారులు జిల్లాలోని వివిధ బ్యాంకులకు వెళ్ళి కార్మికుల రుణపత్రాలను (డాక్యుమెంట్లు) పరిశీలిస్తున్నారు. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
4 రోజుల్లో పరిశీలన పూర్తి
చేనేత కార్మికులకు లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 2,100 మంది కార్మికులు రూ.6 కోట్ల వరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకు న్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సంబంధిత అధికారులు బ్యాంకులకు వెళ్లి కార్మికులు తీసుకున్న రుణాలను పరిశీలిస్తు న్నారు. చేనేత కార్మికులు తీసుకున్న రుణం, ప్రస్తుత పరిస్థితిని విచారిస్తున్నారు. అప్పు తీసుకునేందుకు కార్మికులు సమర్పించిన ధ్రువ పత్రాలను పరిశీలిస్తు న్నారు. మరో నాలుగు రోజుల్లో పరిశీలన పూర్తికానున్నది.
రాష్ట్ర స్థాయి కమిటీకి అర్హుల జాబితా
పరిశీలన పూర్తయిన అనంతరం రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికుల జాబితాను రూపొందిస్తారు. అనంతరం దీనిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. కలెక్టర్ అధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశంలో అర్హుల జాబితాను ఆమోదించి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించనున్నారు. అక్కడ ఆమోదం పొందిన అనంతరం అర్హులకు రుణమాఫీని వర్తింపచేస్తారు.
అర్హులకు న్యాయం జరుగుతుంది
గోవిందయ్య, చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి : ప్రభుత్వం కల్పించిన రుణమాఫీ అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా విచారణ చేస్తున్నాము. గుర్తింపు పారదర్శకంగా జరుగుతోంది. ఎక్కడ కూడా పక్షపాత దోరణి చూపటంలేదు. మూడు జిల్లాలో గత 10 రోజులుగా ఈ విచారణ సాగుతోంది. అర్హులను గుర్తిస్తున్నాము. 4 రోజులలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.