కార్మికులపై వేధింపులు ఆపాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:01 PM
జడ్చర్ల మునిసిపాలిటీలోని శానిటేషన్ కార్మికులపై వేధింపులను ఆపాలంటూ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇందిరమ్మ, ఆకుల వెంకటేశ్ డిమాండ్ చేశారు.
జడ్చర్ల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల మునిసిపాలిటీలోని శానిటేషన్ కార్మికులపై వేధింపులను ఆపాలంటూ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇందిరమ్మ, ఆకుల వెంకటేశ్ డిమాండ్ చేశారు. జడ్చర్ల మునిసిపల్ కార్యాలయంలో యూనియన్ మొదటి సమావేశం మంగళవారం నిర్వహించగా వారు మాట్లాడారు. కార్మికులను తెల్లవారుజామున 5 గంటలకు హాజరు పేరుతో జవాన్లు వేధిస్తున్నారని, ఫొటో గుర్తింపులతో మరింత వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విధులకు పది నిమిషాలు ఆలస్యమైతే నూతనంగా వచ్చిన శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కులలో పనిచేసే మహిళలను దూరంగా ఉన్న పార్కులలో పనులు చేపట్టాలంటూ హుకుం జారీ చేస్తున్నారని వాపోయారు. వేధింపులను ఆపాలని, అలాగే పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రంను కమిషనర్‌కు అందచేస్తామని వెల్లడించారు. అంజమ్మ, అనూష, స్వరూప, అలివేలు, చంద్రకళ, శ్యామల, రాజు, వినోద్, శంకర్, ఆంజనేయులు పాల్గొన్నారు.