అర టీఎంసీ అదనమే..
ABN , Publish Date - May 02 , 2025 | 11:42 PM
ఏదుల నుంచి డిండికి నీటి తరలింపు వ్యవహారంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
- ఏదుల నుంచి డిండికి నీటి తరలింపుపై మంత్రి ఉత్తమ్ స్పష్టత
- స్టాండ్‌బై మోటార్లను కూడా వినియోగించుకోవాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయం
- అంతా అనుకున్నట్లు జరిగితే అనిశ్చితి వీడినట్లే
నాగర్‌కర్నూల్, మే 2 (ఆంధ్రజ్యోతి): ఏదుల నుంచి డిండికి నీటి తరలింపు వ్యవహారంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నల్గొండ జిల్లాకు తీసుకెళ్తున్న అర టీఎంసీ నీరు అదనమేనని స్పష్టత ఇచ్చారు. గురువారం నార్లాపూర్ నుంచి వట్టెం పంపుహౌజ్ వరకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి యుద్ధప్రాతిపదికన కేటాయించాల్సిన నిధులు రెండేళ్లల్లో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించేందుకు అధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో మంత్రితో కలిసి పనుల పర్యవేక్షణకు వెళ్లిన జిల్లా ఎమ్మెల్యేలు ఏదుల నుంచి డిండికి నీటి తరలింపు వ్యవహారంలో ఈ ప్రాంత ప్రజల్లో నెలకొన్న ఆందోళన గురించి అంతర్గత సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్న మంత్రి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకంలో లబ్ధి చేకూరే ప్రాంతాల రైతులకు నష్టం వాటిల్లకుండానే ఏదుల ద్వారా డిండికి నీటిని తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
అదనంగా అర టీఎంసీ నీటి తరలింపునకు ప్రత్యేక కార్యాచరణ
ఏదుల నుంచి డిండికి అర టీఎంసీ నీటిని కేటాయించాలని నిర్ణయించిన నేపథ్యంలో క్యాబినేట్ ఆమోదానికి ముందే ఇరిగేషన్ శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో శ్రీశైలం బ్యాక్ వాటర్‌పై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేశారు. ఈ క్రమంలో నార్లాపూర్‌లోని మొదటి పంపుహౌజ్ వద్ద 3500క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్థ్యం గల 9మోటార్లను బిగించనున్నారు. ఇందులో ఒక మోటారును స్టాండ్‌బైగా పెడుతారు. ఏదుల, వట్టెం పంపుహౌజ్‌లో ఇంతే సామర్థ్యం గల పది మోటార్లను అమర్చనున్నారు. ఇందులో ఒక్కొక్కటి తాండాబాయ్‌గా ఉండనుంది. ఉద్దండపూర్ పంపుహౌజ్‌లో ఐదు మోటార్లను బిగిస్తారు. ఏదుల నుంచి డిండి నీటి తరలింపు వ్యవహారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర టీఎంసీ నీటిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా డిండికి నీటిని తరలించాలని యోచన ప్రభుత్వానికి వచ్చినప్పుడు కొన్ని ప్రజా సంఘాలు అభ్యంతరం చేసిన విషయం తెలిసిందే. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే ఏదుల నుంచి డిండికి తరలించే అర టీఎంసీ నీళ్లు అదనమేనని ఆయన చెప్పడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో ‘ఆంధ్రజ్యోతి’ పలువురు సాగునీటి శాఖకు చెందిన నిపుణులను సంప్రదించగా టెక్నికల్‌గా నీటి తరలింపు వ్యవహారంపై స్పష్టతనిచ్చారు. నార్లాపూర్ మొదటి పంపుహౌజ్‌లో 8మోటార్లు ఒకటి స్టాండ్‌బై ఉండగా, స్టాండ్‌బై మోటారును కూడా కృష్ణానదికి వరద వచ్చినప్పుడు వినియోగించుకోవాలని నిర్ణయించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మోటార్లన్నీ కూడా 3500క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్థ్యం కంటే 20శాతం అధికంగా ఉండటం వల్ల దాదాపు నాలుగు టీఎంసీల నీటిని ఏదుల నుంచి డిండికి తరలించడం అసాధ్యం కాదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని అధికారికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ ఒక విషయం గమనించాల్సిందేంటంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరందాలన్న అర టీఎంసీ చొప్పున ఏదుల నుంచి డిండి వరకు కృష్ణా జలాలను తరలించాలన్నా ఎగువ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురిసి కృష్ణానదికి 60రోజులు వరద జలాలు వస్తేనే సాఽధ్యమవుతుంది. కృష్ణానది జలాల వినియోగం విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగుతున్న క్రమంలో ఇది ఎంత మేరకు సాఽఽఽధ్యమవుతుందనే అంశం వేచి చూడాల్సి ఉంది.