Share News

ధాన్యం.. దోపిడీ

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:04 PM

పౌరసరఫరాల శాఖలో ఎన్ని ప్రక్షాళనలు చేస్తున్నా.. ధాన్యం పక్కదారి పట్టించడం మాత్రం ఆగడం లేదు. అధికారుల అండదండలు దండిగా ఉండటం, ఏదైనా తప్పు జరిగి దొరికినప్పుడు రైస్‌ మిల్లర్ల సంఘం పూర్తి స్థాయిలో కార్యాలయాల వద్దనే ఉండి పైరవీలు చేయడం, ఆమ్యామ్యాలు అందిస్తుండటంతో సీఎంఆర్‌ కోసం కేటాయించిన ధాన్యం యథేచ్ఛగా పక్క రాష్ర్టాలకు తరలిపోతోంది.

ధాన్యం.. దోపిడీ
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్‌ వద్ద ఈ నెల 11న పట్టుబడిన ధాన్యం లారీ

పక్క రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న రైస్‌ మిల్లర్లు

నెలరోజుల వ్యవధిలో మూడు లారీలను పట్టుకున్న అధికారులు

నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్న పౌరసరఫరాల శాఖ

సీఎంఆర్‌ స్థానంలో రేషన్‌ రీసైక్లింగ్‌ బియ్యం సీఎ్‌ససీకి అప్పగింత

చక్రం తిప్పుతున్న రైస్‌ మిల్లర్ల సంఘం.. రోజూ ఆఫీసుల వద్ద నాయకుల పైరవీలు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పౌరసరఫరాల శాఖలో ఎన్ని ప్రక్షాళనలు చేస్తున్నా.. ధాన్యం పక్కదారి పట్టించడం మాత్రం ఆగడం లేదు. అధికారుల అండదండలు దండిగా ఉండటం, ఏదైనా తప్పు జరిగి దొరికినప్పుడు రైస్‌ మిల్లర్ల సంఘం పూర్తి స్థాయిలో కార్యాలయాల వద్దనే ఉండి పైరవీలు చేయడం, ఆమ్యామ్యాలు అందిస్తుండటంతో సీఎంఆర్‌ కోసం కేటాయించిన ధాన్యం యథేచ్ఛగా పక్క రాష్ర్టాలకు తరలిపోతోంది. నెల రోజుల వ్యవధిలోనే మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల పరిధిలో ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్న మూడు లారీల ధాన్యాన్ని పట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే రెండు లారీలకు దాదాపు క్లీన్‌చిట్‌ ఇచ్చి విడుదల చేయగా.. ఈ నెల 11వ తేదీన పెబ్బేరు మండలం శాఖాపూర్‌ వద్ద పట్టుకున్న లారీకి సంబంధించి విచారణ కొనసాగుతోంది. రేషన్‌ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం ఏటా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం రైస్‌ మిల్లులకు కేటాయిస్తోంది. ఆ ధాన్యాన్ని మర ఆడించి.. తిరిగి ఎఫ్‌సీఐకి, సీఎ్‌ససీకి మిల్లర్లు నిర్దేశిత గడవులోగా అప్పగించాలి. కానీ ఏ జిల్లాలోనూ మిల్లర్లు సీఎంఆర్‌ను సమయానికి డెలివరీ చేయడం లేదు. గడువుపై గడువు పెంచుకుంటూ పోయినా వేలాది మెట్రిక్‌ టన్నుల బియ్యం పెండింగ్‌లోనే ఉంచుతున్నారు. సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులపై ఆర్‌ఆర్‌ యాక్టు (రెవెన్యూ రికవరీ) పెడతామని గతంలో చెప్పినప్పటికీ వారు మాత్రం బెదరడం లేదు. ప్రభుత్వ స్థాయిలో ఈ విషయంపై సీరియ్‌సగా ఉన్నప్పటికీ.. స్థానికంగా ఉండే అధికారుల ఉదాసీన వైఖరితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పుడైనా కచ్చితమైన సమాచారంతో ధాన్యం లేదా రేషన్‌ బియ్యం పట్టుబడినా.. టెక్నికల్‌ అసిస్టెంట్లను మేనేజ్‌ చేయడం దగ్గర నుంచి విడుదల చేయడం వరకు అధికారులే దగ్గరుండి సహకరిస్తున్నారు.

నామమాత్రపు చర్యలు..

సీఎంఆర్‌ కోసం ధాన్యం కేటాయించిన తర్వాత పక్క రాష్ర్టాల్లో ఎక్కువ ధర లభిస్తుండటంతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దాని స్థానంలో రైస్‌ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో రేషన్‌ డీలర్ల ద్వారా బియ్యం రీసైక్లింగ్‌ చేసి.. వాటిని కొద్దికొద్దిగా సీఎ్‌ససీకి తరలిస్తున్నారు. వారు అధికారులను మేనేజ్‌ చేస్తున్నారు. గత నెల 14న పెబ్బేరు మండలంలో సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్న లారీ విషయంలో సైతం విచారణలో కాలయాపన చేసి.. సరైన పద్ధతిలో ఎంక్వైరీ చేయకుండా చివరకు ఒకే ఒక లైన్‌ రిపోర్టుతో క్లీన్‌చిట్‌ ఇచ్చి విడుదల చేశారు. ప్రభుత్వ ముద్రణతో ఉన్న బస్తాల్లో ధాన్యం తరలిస్తున్న మిల్లర్‌ డీలర్ల వద్ద సంచులు కొనుగోలు చేశారని చెప్పి.. నామమాత్రపు జరిమానా విధించారు. సదరు మిల్లులో ఉండాల్సిన ధాన్యం కంటే అధికంగా ఉన్నా ఆ కోణంలో విచారణ కూడా చేయలేదు. అలాగే గతవారం పెబ్బేరు మండలంలోని శాఖాపూర్‌లో అద్వైత్‌ మిల్లు నుంచి కర్ణాటకలోని రాయిచూరుకు తరలిస్తున్న ధాన్యం లారీని పట్టుకున్న అధికారులు విచారణ చేస్తున్నారు. మరి ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తేలాల్సి ఉంది. ఉన్నతాధికారులు సీరియ్‌సగా ఉన్నప్పటికీ.. పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులు తప్పుడు నివేదికలు అందజేస్తూ అక్రమార్కులను తప్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నెల మొదటివారంలో కోస్గిలోని ఓ రైస్‌మిల్లు నుంచి ధాన్యం తరలిస్తుండగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలంలోని కొందరు పట్టుకుని పోలీ్‌సస్టేషన్‌ తరలించారు. తర్వాత లారీలో ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు సీజ్‌ చేశారు. మూడు రోజుల తర్వాత తాము జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని రాధిక అగ్రోటెక్‌కు ధాన్యం తరలిస్తున్నట్లు పత్రాలు సృష్టించారు. ఒకవేళ ముందస్తుగానే వారి వద్ద పత్రాలు లేకుండా వాటిని తరలించారా? అనేది ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది.

నయా రేషన్‌ డాన్‌..

ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తిలో సీఎంఆర్‌ అక్రమాలు అధికంగా జరుగుతున్నాయి. ధాన్యం ఉత్పత్తి, మిల్లర్లు ఇక్కడే అధికంగా ఉండటంతో అక్రమాలు కూడా భారీగా ఉన్నాయి. అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రం రైస్‌ మిల్లర్ల సంఘం నాయకులు కొందరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పట్టుబడిన ధాన్యాన్ని, లారీలను విడిపించడం, అధికారులను మేనేజ్‌ చేయడం, ప్రారంభం కాని రైస్‌ మిల్లులకు ఎలాంటి అనుమతులు లేకున్నా ధాన్యం కేటాయింపులు చేయించడం వంటి పైరవీలు చేస్తున్నారు. ఎప్పుడు వెళ్లినా వనపర్తి రైస్‌మిల్లర్ల సంఘం నాయకులు పౌర సరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ కార్యాలయాల చుట్టూనే కనిపిస్తుంటారు. అంతలా అధికారులతో ఏం పని ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. సంఘం ఓ నాయకుడికి సంబంధించిన మిల్లులను కూడా గతంలో బ్లాక్‌ లిస్టులో పెట్టి తిరిగి కేటాయింపులు చేశారు. రోజూ పైరవీలతోనే అధికారుల చుట్టూ తిరుగుతున్న ఆయనను నయా రేషన్‌ డాన్‌ అని పిలుస్తుండటం గమనార్హం. గతంలో ఒక రేషన్‌ డాన్‌ వనపర్తి జిల్లాలో ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ నాయకులకు సహకరించారనే కారణంతో ఆయన్ను తొక్కిపెట్టారు. ఇప్పుడు ఈ నయా రేషన్‌ డాన్‌ ఆధ్వర్యంలోనే రైస్‌ మిల్లర్లు అక్రమ దందాను మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగిస్తున్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:04 PM