Share News

నేడు పీయూలో స్నాతకోత్సవం

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:38 PM

పాలమూరు యూనివర్సిటీ నాల్గో స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హాజరుకానున్నారు.

నేడు పీయూలో స్నాతకోత్సవం

హాజరుకానున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

పాలమూరు యూనివర్సిటీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పాలమూరు యూనివర్సిటీ నాల్గో స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హాజరుకానున్నారు. గవర్నర్‌తో పాటు ముఖ్య అతిథిగా ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ కంపెనీ వ్యస్థాపకులు, చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మన్నె సత్యనారాయణరెడ్డి రానున్నారు. ఈ స్నాతకోత్సవంలో పన్నెడు మందికి పీహెచ్‌డీ పట్టాలు, 71 మందికి బంగారు పతకాలు, 2,809 మందికి పీజీ, 18,666, మందికి యూజీ డిగ్రీలు అందించనున్నారు. వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో యూనివర్సిటీ అధికారులు ఏడు కమిటీలుగా ఏర్పడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

భద్రతా ఏర్పాట్ల పరిశీలన

చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వస్తుండటంతో బుధవారం వర్సిటీలో అధికా రులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో పీయూ రిజిస్ర్టార్‌ పూస రమే్‌షబాబు, ఎస్పీ జానకి, అదనపు ఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు డీపీఆర్‌ఓ శ్రీనివాసులు, పీయూ పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్‌ ప్రవీణ భద్రతా చర్యలు పరిశీలించారు. గవర్నర్‌ కాన్వాయ్‌ వచ్చే మార్గం, స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించే హాల్‌, వేదికను అన్ని కోణాల్లో పరిశీలించారు. గవర్నర్‌ తిరిగి వెళ్లే వరకు తీసుకోవాల్సిన భద్రత చర్యలకు సంబంధించి వర్సిటీ అధికారులకు సూచించారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టనున్నారు.

గవర్నర్‌ పర్యటన ఇలా..

ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. 10:30 గంటలకు గవర్నర్‌ వర్సిటీకి చేరుకుంటారు. విద్యార్ధులకు పతకాల ప్రదానం, సందేశం 12.30కి పూర్తవుతుంది. 2 గంటల వరకు యూనివర్సిటీ చాన్సలర్‌ రెసిడెన్సీలో బస, భోజనం ఉంటుంది. మధ్యాహ్నం 2:10 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుంటారు. 2:45 గంటల వరకు అక్కడి కార్యక్రమంలో పాల్గొంటారు. 2:45కి రచయితలు కవులు కళాకారులతో ముఖముఖిగా మాట్లాడతారు. సాయంత్రం హైదరాబాద్‌ బయల్దేరి వెళ్తారు.

వారికి మాత్రమే అనుమతి

స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించే లైబ్రరీ ఆడిటోరియంలో సీటింగ్‌ సదుపాయం తక్కువగా ఉండటం, భద్రతా చర్యల నేపథ్యంలో ముఖ్య అతిథులు, యూనివర్సిటీ ము ఖ్య అధికారులు, స్నాతకోత్సవంలో పట్టాలు పొందే విద్యార్థులను మాత్రమే అనుమతించనున్నారు. మిగతా విద్యార్థులు, తల్లిదండ్రులు వీక్షించేందుకు వర్సిటీలోని ఆయా విభాగాల వద్ద ప్రత్యేక స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో లైవ్‌ ప్రసారం చేయనున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:38 PM