Share News

నిర్వాసితులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:27 PM

నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

నిర్వాసితులకు అండగా ప్రభుత్వం
కొల్లాపూర్‌లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రంలో జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌

- ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆగర్‌కర్నూల్‌ జిల్లా, కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, రెవెన్యూ, సాగునీటి పారుదల అధికారులతో సోమవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొల్లాపూర్‌ మండల పరిధిలోని నార్లాపూర్‌ రిజర్వాయర్‌ కింద ముంపునకు గురవుతున్న గ్రామాలు, పునరావాస కాలనీల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్వాసితుల పునరావాసానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు పునరావాస కాలనీల్లో వసతులు, నీరు, విద్యుత్‌, రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల్లో పనుల పురోగతి, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై నివేదికలను అధికారులు మంత్రికి సమర్పించారు. సర్వం కోల్పోతున్న ప్రతీ కుటుంబానికి న్యాయం జరగాలని మంత్రి వారిని ఆదేశించారు. కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏర్పాటు తదితరాలపై మంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, పాలమూరు - రంగారెడ్డి భూ సేకరణ ప్రత్యేకాధికారి మధుసూదన్‌ నాయక్‌, ఆర్డీవో భన్సీలాల్‌, రెవెన్యూ, సాగునీటి పారుదల శాఖల అధికారులు, ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:27 PM