పల్లెల్లో పాలన అస్తవ్యస్తం
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:04 PM
ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో అభివృద్ధి మాట అటుంచితే సమస్యలే పరిష్కారం కావడం లేదు.

నిధుల లేమితో పరిష్కారం కాని సమస్యలు
అప్పులు తెచ్చి నెట్టుకొస్తున్న కార్యదర్శులు
పాలకవర్గం లేకపోవడంతో రాని కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు
పారిశుధ్య కార్మికుల జీతాలు మాత్రం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
రూ.22.5 కోట్లకు గాను ఇచ్చింది రూ.6.5 కోట్లే..
మహబూబ్‌నగర్ న్యూటౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో అభివృద్ధి మాట అటుంచితే సమస్యలే పరిష్కారం కావడం లేదు. చాలా చోట్ల తాగునీరు, పారిశుధ్య సమస్యలు నెలకొన్నాయి. సర్పంచుల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. అప్పటి నుంచి పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. దాదాపు 15 నెలలుగా కార్యదర్శులు అప్పులు తెచ్చి, పరిపాలన సాగిస్తున్నారు. ఇటీవల వసూలు చేసిన పన్నుల నుంచి కొంత డబ్బు ఖర్చు చేసినా గ్రామాలలో కుంటుపడ్డ అభివృద్ధి పనులకు అవి ఏ మాత్రం చాలడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నెలకు రూ 1.5 లక్షలు విడుదల చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహబూబ్‌నగర్ జిల్లాలోని 16 మండలాలకు ప్రతీ నెల రూ.1.5 లక్షలు విడుదల చేయాల్సి ఉంది. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసి 15 నెలలు కావస్తున్నా నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎ్‌సఎ్‌ఫసీ) నుంచి మాత్రం పంచాయతీ కార్మికుల జీతాలు మాత్రం విడుదల చేసింది. మొత్తం రూ22.5 లక్షలకు గాను.. వర్కర్ల జీతాలకు రెండుసార్లు రూ.6.25 లక్షలు విడుదల చేసింది. అదికూడా కార్మికులు తమకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేయడంతో విడుదల చేసింది. కేంద్రం విడదల చేయాల్సి 15వ ఆర్థిక సంఘం నిధులు పాలకవర్గం లేని కారాణంగా విడుదల చేయడం లేదు. పాలకవర్గం బాధ్యతలు చేపడితే తప్ప ఆ నిధులు వచ్చే పరిస్థితి లేదు. అటు కేంద్ర నిధులు రాక, ఇటు రాష్ట్రం నిధులు విడుదల చేయక గ్రామ పంచాయతీల నిర్వహణ ప్రత్యేక అధికారులకు తలకుమించిన భారంగా మారింది.
ట్రాక్టర్‌ల ఈఎంఐలు కట్టేందుకూ అవస్థలు
గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతీ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. నిధులు ఉన్న పంచాయతీలు ఒకే సారి డబ్బు చెల్లించగా, నిధులు లేక పంచాయతీలు బ్యాంకు రుణం ద్వారా కొన్నాయి. రుణంపై కొనుగోలు చేసిన పంచాయతీలు ఇప్పుడు నెల నెల లోను కట్టలేక ఇబ్బందులు పడుతున్నాయి. రెవెన్యూ ఉన్న గ్రామాలు లోన్లు చెల్లిస్తుండగా, లేని గ్రామాలు చెల్లించడం లేదు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యంతో పాటు ఇతర సమస్యలు నెలకొన్నాయి. తమ స్థాయిలో కార్యదర్శులు అప్పులు తెచ్చి, ఖర్చు చేస్తున్నా పూర్తిగా పరిష్కారం కావడం లేదు.
కుంటుంపడుతున్న అభివృద్ధి
పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చే యకపోవడంతో కార్యదర్శులు ని ర్వహణ కోసం అప్పుల పాలవుతున్నారు. రేపోమాపో ఎన్నికలు నిర్వహిస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం వాయిదా వేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బాధ్యతలు కార్యదర్శులపైనే వేయడంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు.
- వెంకటయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శుల సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడు
నిధులు త్వరలో విడుదలయ్యే అవకాశం
గ్రామాలలో పాలకవర్గం ఏర్పాటు అయితేనే కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది. ఎన్నికల వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతోనే గ్రామలలో అభివృద్ధి పనులు చేపాట్టాల్సి ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా వారి ఖాతాల్లో జమ చేసింది. రెవెన్యూ ఉన్న గ్రామాలలో వచ్చిన నిధులతో పనులు చేపడుతున్నారు. లేని గ్రామాలలో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసినందున నిధులు త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
- పార్థసారథి, డీపీవో