గంగాపురం గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:13 PM
గంగాపురం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి హమీ ఇచ్చాడు.
- ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధరెడ్డి
- రూ.81 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం
జడ్చర్ల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : గంగాపురం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి హమీ ఇచ్చాడు. మంగళవారం గంగాపురం గ్రామ పంచాయతీలో రూ.81 లక్షలతో నిర్మించే అభివృద్ధి పనులు ప్రారంభించి, మాట్లాడారు. గంగాపురం గ్రామానికి రూ.42 లక్షలు ముడా నిధులు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో నిర్మించిన నూతన షెడ్‌ను ప్రారంభించారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జడ్చర్ల మునిసిపాలిటీ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
కమీషన్ల కోసమే రోడ్డెక్కిన ఎమ్మెల్సీ కవిత
తనకు రావల్సిన కమీషన్లు రాలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రోడ్డెక్కిందని, సీబీఐ విచారణ జరిగితే తమ నాయకుడు కేసీఆర్ చేసిన తప్పులు భయటపడాతయని ఆ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం అవినీతి పంచాయతీ ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతల ఇంటి పంచాయతీగా మారిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతిలో తన వాటా కవితకు వచ్చి ఉంటే ఆమె బయటికి వచ్చి ఉండేది కాదన్నారు. ఒక టీఎంసీ సామర్థ్యం పెంచే పేరుతో ఉన్న నిధులన్నీ కాళేశ్వరంకు తరలించారని, ఇది తప్పని పేర్కొని ఆనాడే బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేసి ఉంటే రూ.32 వేల కోట్లతోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయి ఉండేదన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు సిఫారసుకు పెట్టారని బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ భాషా, సంస్కృతి మండలి సభ్యుడు బాదిమి శివకుమార్, జడ్చర్ల మునిసిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జ్యోతిఆల్వాల్‌రెడ్డి, నాయకులు నిత్యానందం, బుక్క వెంకటేశ్, కాట్రేపల్లి లక్ష్మయ్య, జనార్దన్‌రెడ్డి, కుమ్మరి రాజు, చైతన్య చౌహన్, అనుప కృష్ణయ్య, తుంగ ఘు, శాగ రఘు, రమేశ్ పాల్గొన్నారు.