కోయిల్‌సాగర్ నుంచి పాలమూరుకు..
ABN , Publish Date - Aug 16 , 2025 | 10:59 PM
పాలమూరు జిల్లాలో ఉన్న ఏకైక సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్ నుంచి మరో 4 వేల ఎకరాలకు నీరందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరదల సమయంలో ప్రాజెక్టు నిండిన తరువాత అదనంగా వచ్చే నీటిని ఎత్తిపోసుకుని, లిఫ్ట్ ద్వారా చెరువులు నింపుకుని పంటల సాగుకు అందించాలనే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతోంది.
4 వేల ఎకరాలకు అందించేందుకు నిర్ణయం
కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు
వరదల సమయంల నింపుకొని, గ్రావిటీ ద్వారా 25 చెరువులను నింపుకునేలా ప్రతిపాదన
మహబూబ్‌నగర్ మండలంలోని దాదాపు 15 గ్రామాలకు ప్రయోజనం
పూర్తయిన సర్వే.. త్వరలోనే అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి అందజేత
తక్కువ భూసేకరణ తో నీరందించేందుకు కసరత్తు
మహబూబ్‌నగర్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): పాలమూరు జిల్లాలో ఉన్న ఏకైక సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్ నుంచి మరో 4 వేల ఎకరాలకు నీరందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరదల సమయంలో ప్రాజెక్టు నిండిన తరువాత అదనంగా వచ్చే నీటిని ఎత్తిపోసుకుని, లిఫ్ట్ ద్వారా చెరువులు నింపుకుని పంటల సాగుకు అందించాలనే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగానే ప్రాజెక్టు నుంచి మహబూబ్‌నగర్ మండలానికి సాగు నీరు అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ సంస్థకు సర్వే బాధ్యతలు అప్పగించగా, దానిని పూర్తి చేశారు. కోయిల్‌సాగర్ సమీపంలోని కొండాపూర్ వద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోయనున్నారు. ఆ లిఫ్ట్ నుంచి పెర్కివీడ్ వద్ద సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి కేశవాపూర్, మణికొండ మీదుగా మహబూబ్‌నగర్ మండలంలోని చెరువులను గ్రావిటీ ద్వారా నీటిని నింపుతారు. దాంతో ఆ చెరువుల కింద ఉన్న దాదాపు 15 గ్రామాలు సస్యశ్యామలం కానున్నాయి. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండంటంతో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సర్వే నివేదిక రాగానే అంచనాల తయారీ
ఎత్తిపోతల ఏర్పాటుకు సర్వే పూర్తి చేసిన ఏజెన్సీ డ్రాయింగ్స్‌ను అధికారులకు అందజేసిన వెంటనే అంచనాలు రూపొందించి, ఈనెలాఖరులోగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయనున్నారు. లిఫ్ట్ నుంచి సిస్టమ్ వరకు నీళ్లు రావడానికి పైపులు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కాలువలు తీసి, చెరువులకు నీరు అందించాల్సి ఉంటుంది. వీటన్నింటికి అయ్యే బడ్జెట్‌తోపాటు భూసేకరణకు సంబంధించిన ని వేదికను కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ లిఫ్ట్ పరిధిలో మండలంలోని దాదాపు 25 చెరువులను నింపనున్నారు. చెరువులను కూడా బలోపేతం చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికి బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంది. అయితే భూసేకరణ చాలా తక్కువగానే ఉండనుందని అధికారులు చెబుతున్నారు. చెరువుల్లోకి నీటిని తెస్తే వాటికింద ఉన్న పొలాలకు ప్రస్తుతం అందుతున్న విధంగానే నీరు సరఫరా కానుంది. చెరువులకు నీరు తీసుకెళ్లడానికి మాత్రం కాల్వలను తవ్వాల్సి ఉంది.
ఆ గ్రామాలకు ప్రయోజనం
ఈ లిఫ్ట్ ద్వారా మండలంలోని 4 నుంచి 5 వేల ఎకరాలకు నీరందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 15 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇదే జరిగితే మహబూబ్‌నగర్ మండలం సస్యశ్యామలం కానుంది. వరదల సమయంలో చెరువులను నింపుకుంటే ఒక పంటకు ఢోకా ఉండదు. భూగర్బజలాలు కూడా పెరగనున్నాయి. మండలంలోని మణికొండ, కోటకదిర, ఓబ్లాయిపల్లి, మాచన్‌పల్లి, రాంచంద్రాపూర్, కోడూర్, అప్పాయపల్లి, జమిస్తాపూర్, బొక్కలోనిపల్లి, చౌదర్‌పల్లి, ధర్మాపూర్, అల్లీపూర్, వెంకటాయపల్లి గ్రామాలకు సాగునీరు అందనుంది.
త్వరలోనే కార్యరూపం
ఈ ప్రాజెక్టు తొందరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు ధీమా వ్యక్తం చేసున్నారు. 4 వేల ఎకరాలు అంటే 0.5 టీఎంసీల నీరు అవసరమవుతాయి. ఇప్పటికే కోయిల్‌సాగర్ నుంచి మహబూబ్ నగర్ కార్పొరేషన్ తాగునీటి అవసరాల కోసం 0.5 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్నారు. రోజూ 28 ఎంఎల్‌డీల నీటిని వాడుకుంటున్నాం. ప్రస్తుతం కోయిల్‌సాగర్ నుంచి దేవరకద్ర, సీసీకుంట మండలాలకు సాగునీరు అందిస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ మండలానికి నీరందించే ప్రతిపాదన రావడంతో అక్కడి రైతులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. వరదలు వచ్చే సమయంలో ప్రాజెక్టును నింపుకునే తరహాలోనే ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేయనుండటంతో కోయిల్‌సాగర్ కింద ప్రస్తుతం నీళ్లు ఇస్తున్న మండలాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు.