మధ్యాహ్న భోజనంలో కప్ప?
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:39 PM
సీసీకుంట మండలం లాల్‌కోట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బుధవారం కప్ప కళేబరం వచ్చిందన్న విషయం కలకలం రేపింది. రోజు మాదిరిగా అక్షయపాత్ర నుంచి పాఠశాలకు మధ్యాహ్న భోజనం వచ్చింది.
సీసీకుంట మండలం లాల్‌కోట పాఠశాలలో కలకలం
పప్పులో కనిపించిన కళేబరం
భోజనం చేయకుండా వెళ్లి తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థులు
ఫిర్యాదు అందిందన్న డీఈఓ.. నేడు విచారణ చేస్తామని వెల్లడి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): సీసీకుంట మండలం లాల్‌కోట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బుధవారం కప్ప కళేబరం వచ్చిందన్న విషయం కలకలం రేపింది. రోజు మాదిరిగా అక్షయపాత్ర నుంచి పాఠశాలకు మధ్యాహ్న భోజనం వచ్చింది. వడ్డించే సమయంలో పప్పులో కప్ప కనిపించిందని కొందరు విద్యార్థులు చెప్పినట్లు సమాచారం. దాంతో వారు భోజనం చేయకుండా ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం చేశారు. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కప్ప విషయం బయటకు పొక్కకుండా పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారని సమాచారం. డీఈవో ప్రవీణ్ కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా లాల్‌కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కప్ప వచ్చినట్లు ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. గురువారం పాఠశాలకు వెళ్లి పూర్తి విచారణ చేయనున్నట్లు తెలిపారు.