నాలుగేళ్లుగా ఎదురుచూపులు
ABN , Publish Date - May 27 , 2025 | 11:14 PM
కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహకం అందడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఎదురుచూపులు తప్పడం లేదు. కులాంతర వివాహం చేసుకున్న వారికి ఆర్థిక భద్రత కల్పించడం, సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం కల్పించడమే లక్ష్యంగా పోత్సాహకం అందిస్తోంది.
- కులాంతర వివాహ జంటలకు అందని ప్రోత్సాహకం
- నిధుల విడుదలలో తీవ్ర జాప్యం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం మే 27 (ఆంధ్రజ్యోతి) : కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహకం అందడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఎదురుచూపులు తప్పడం లేదు. కులాంతర వివాహం చేసుకున్న వారికి ఆర్థిక భద్రత కల్పించడం, సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం కల్పించడమే లక్ష్యంగా పోత్సాహకం అందిస్తోంది. గతంలో రూ. 50 వేలు ఇచ్చేవారు. ఆ ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. 2019, నవంబరు ఒకటిన పోత్సాహకాన్ని రూ. 2.50లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నా, లబ్ధిదారులకు నగదును అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లుగా నిధులు మంజూరు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నిధులు మంజూరు కాలేదని, వస్తే ఇస్తామని సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమాజంలో వస్తున్న మార్పు
మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. కులంపై గతంలో ఉన్న పట్టింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో కులంలోనే పెళ్లిళ్లు జరిగేవి. ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. కులం ప్రాధాన్యం తగ్గిపోయి ఇతర అంశాల వైపు దృష్టి సారిస్తున్నారు. కులం ఏదైనా అభిప్రాయాలు, అభిరుచులు కలిస్తే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే పెద్దలు కూడా పట్టింపులను వదిలేసి సర్దుకుంటున్నారు. కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు పోలీసులను ఆశ్రయించి వివాహం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం ద్వారా అందే సాయం వారికి ఆర్థిక భద్రత కల్పిస్తోంది. కానీ సకాలంలో డబ్బు అందకపోవడంతో ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కులాంతర వివాహం చేసుకున్న వారికి సకాలంలో ప్రోత్సాహకం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకోవడం ఇలా ...
వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే, సంబంధిత ఆధారాలతో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి అర్హులను గుర్తించి, ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. దీని ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. వాటిని కులాంతర వివాహం చేసుకున్న జంటలకు అందిస్తారు.
32 జంటలకు మాత్రమే పోత్సాహకం
మహబూబ్‌నగర్ జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు 122 జంటలు పోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 32 జంటలకు మాత్రమే నగదు అందింది. మిగతా వారు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. నారాయణపేట జిల్లాలో 79 జంటలు దరఖాస్తు చేసుకోగా, 34 మందికి ప్రభుత్వ సాయం అందింది. ఇంకా 45 జంటలకు నగదు అందాల్సి ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 154 జంటలు దరఖాస్తు చేసుకోగా, 11 జంటలకు మాత్రమే పోత్సాహకం మంజూరయ్యింది. మరో 143 మంది నగదు మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రోత్సాహకానికి అర్హుల వీరే ...
- పెళ్లి చేసుకున్న దంపతుల్లో ఒకరు తప్పని సరిగా షెడ్యూల్డ్ కులానికి చెందిన వారై ఉండాలి. మరొకరు ఇతర కులానికి చెందిన వారు ఉండాలి.
- యువతికి 18 ఏళ్ల వయసు, యువకుడికి 21 ఏళ్ల వయసు ఉండాలి. వివాహచట్టం 1965 కింద నమోదు అయి ఉండాలి. .
- పెళ్లి చేసుకున్న జంట వార్షిక ఆదాయం రూ.5 లక్షల కన్నా తక్కువ ఉండాలి
- మొదటి వివాహం అయిన వారికి మాత్రమే పోత్సాహకం ఇస్తారు.
- వివాహం అయిన ఏడాదిలోపు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
నిధులు వచ్చిన మేరకు అందిస్తున్నాం
కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం పోత్సాహకం అందిస్తోంది. సకాలంలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన మేరకు అందిస్తున్నాం. ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో మరో 90 మందికి పోత్సాహకం అందించాల్సి ఉంది. నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. రాగానే లబ్ధిదారులకు అందిస్తాం.
- సుదర్శన్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి, మహబూబ్‌నగర్