జోష్ కోసం..
ABN , Publish Date - Apr 26 , 2025 | 10:57 PM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ.. నేడు వరంగల్‌లో భారీ సభ నిర్వహించబోతోంది. ఆ వేదికగా మళ్లీ పుంజుకుని, భవిష్యత్‌లో సత్తా చాటేందుకు ప్రణాళికలు చేసుకుంటోంది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరంగల్‌లో బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభ
ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో జనం తరలింపునకు ఏర్పాట్లు
కార్యకర్తల్లో ఉత్సాహం.. భవిష్యత్‌లో సత్తా చాటడమే ధ్యేయం
ఉద్యమ ప్రస్థానం, పాలనా విజయాల మేళవింపుతో పునరేకీకరణ
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ.. నేడు వరంగల్‌లో భారీ సభ నిర్వహించబోతోంది. ఆ వేదికగా మళ్లీ పుంజుకుని, భవిష్యత్‌లో సత్తా చాటేందుకు ప్రణాళికలు చేసుకుంటోంది. ఈ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతోపాటు స్థానిక సంస్థల్లో గతంలో ఉన్న మెజారిటీని కాపాడుకోవడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఈ రజతోత్సవ సభకు దాదాపు రెండు నెలల నుంచి పార్టీ మాజీ ఎమ్మెల్యేలు జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు టర్మ్‌లు బీఆర్‌ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది, ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వ చ్చినప్పటికీ.. పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. ఈ క్రమంలో కేడర్‌లో కొంత నిరుత్సాహం వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతుండటం, అధికార పార్టీ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తుందో తెలియకపోవడం వంటి కారణాలతో కూడా బీఆర్‌ఎస్ కేడర్ కొంత ఇబ్బందులకు గురవుతోంది. ఎన్నికలు నిర్వహిస్తే సత్తా చాటుదామని భావిస్తున్నా.. వాయిదాల వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేపట్టలేకపోతున్నామనే భావన వారిలో నెలకొంది. అలాగే సంవత్సర కాలంగా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సభలు ఏవీ జరగకపోవడం, అధినేత దిశానిర్దేశం కూడా చేయకపోవడం కూడా ఇందుకు మరో కారణంగా చెప్పవచ్చు. ఎట్టకేలకు పార్టీ అధిష్ఠానం రజతోత్సవం పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడం, భవిష్యత్ ప్రణాళికపై సభ ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది.
వైఫల్యాలే ఎజెండాగా..
వాస్తవానికి రజతోత్సవ సభ 25 సంవత్సరాలు నిండిన తర్వాత చేయాల్సి ఉంటుంది. గతంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా ఒక సంవత్సరం ముందుగానే నిర్వహించిన మాదిరిగా, బీఆర్‌ఎస్ తమ రజతోత్సవ సభను ఒక సంవత్సరం ముందుగా నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు ప్రధాన కారణం ఇప్పుడు నిర్వహిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ లబ్ధి చేకూరడంతోపాటు, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంటుందని భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల లేమి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఒకేసారి రుణమాఫీ చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర గ్రాంట్లు నిలిచిపోవడం, ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడల కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయనే భావనను ఆధారంగా చేసుకుని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కేడర్ ఆ పార్టీ వైపు మొగ్గినప్పటికీ.. గ్రామాల్లో పార్టీ ఇంకా బలంగానే ఉంది. అయితే నాయకత్వం నుంచి కచ్చితమైన భరోసా లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
భారీగా జన సమీకరణ..
దాదాపు రెండు నెలల నుంచి బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం సభ నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ప్రతీ నియోజకవర్గంలోనూ నిర్వహించారు. ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సులను, పాఠశాలల బస్సులను, డీసీఎంలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. కేడర్ ఎవరికి వారే సొంత వాహనాల్లో కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సగం సీట్లను దక్కించుకుని.. తర్వాత కొందరిని పార్టీలో చేర్చుకుంది. 2018లో మాత్రం మొత్తం 14 స్థానాల్లో 13 స్థానాలు గెలుచుకుని, మిగిలిన ఒక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నారు. అంత బలంగా ఉన్న పార్టీ 2023 ఎన్నికల నాటికి 12 స్థానాలు కోల్పోయి.. కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిచి కొంత ఊరటనిచ్చినా.. పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ రెండు స్థానాలను కోల్పోయింది. తర్వాత అధికార కాంగ్రెస్ అనేక సభలు నిర్వహిస్తూ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జిల్లా పరిధిలో చేసింది. కానీ బీఆర్‌ఎస్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా భారీ సభలు నిర్వహించలేదు. ఈ క్రమంలోనే సభ నిర్వహించడం ఆ పార్టీ శ్రేణుల్లో కచ్చితంగా జోష్ నిలిపే అవకాశం ఉంది.
కేసీఆర్ పాలన కోసం ఆరాటపడుతున్నారు
కాంగ్రెస్ 18 నెలల పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ తిరోగమన చర్యల వల్ల అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడింది. తెలంగాణలో కేసీఆర్ ప్రస్థానం చారిత్రాత్మక ఘట్టం. 25 ఏళ్లుగా స్వరాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేయడంతోపాటు రెండుసార్లు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని ఒక మోడల్ అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు ఆరాటపడుతున్నారు. ప్రజలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం ఈ సభలో కేసీఆర్ చేయబోతున్నారు. రాష్ర్టాభివృద్ధి బీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు.
- సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి
కాంగ్రె్‌సపై దండయాత్రకు సిద్ధం
కాంగ్రె్‌సపై ప్రజలు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. అందుకే స్వచ్ఛందంగా వరంగల్ సభకు తరలిరానున్నారు. 2023కు ముందు పాలన.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ప్రజలు అంచనా వేసుకుంటున్నారు. జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు. కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వడానికి చేత కావడం లేదు. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్ చేపట్టిన పథకాలను అమలు చేయడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. ఈ రజతోత్సవ సభ వేదికగా ప్రజలు తిరుగుబాటు చేసి, కాంగ్రె్‌సను నామరూపాల్లేకుండా చేస్తారు.
- వి.శ్రీనివా్‌సగౌడ్, ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి