‘మామూళ్ల’ శాఖలపై నజర్..!
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:33 PM
సాధారణంగా ఫలానా అధికారి తమ పనిచేయాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎవరైనా అవినీతి నిరోధకశాఖ అధికారులను సంప్రదిస్తే వారితో ప్లాన్ వేసి.. సదరు అధికారికి డబ్బులు ఇస్తుండగా కానీ, ఇచ్చిన తర్వాత కానీ పట్టుకుంటారు. కేసు నమోదు చేసి.. ఏసీబీ కోర్టులో సరెండర్ చేయిస్తారు.
వ్యవస్థీకృతంగా మారిన అవినీతికి చెక్‌పెట్టే ఎత్తుగడ
ఆ కోవలోనే సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో దాడులు
గతంలో రవాణా చెక్ పోస్టుల్లో తనిఖీలు చేసిన ఏసీబీ
కేబినెట్‌లో తీర్మానం చేసి చెక్‌పోస్టులు ఎత్తివేసిన వైనం
మరిన్ని శాఖలపై ఏసీబీ దృష్టి
మహబూబ్‌నగర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సాధారణంగా ఫలానా అధికారి తమ పనిచేయాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎవరైనా అవినీతి నిరోధకశాఖ అధికారులను సంప్రదిస్తే వారితో ప్లాన్ వేసి.. సదరు అధికారికి డబ్బులు ఇస్తుండగా కానీ, ఇచ్చిన తర్వాత కానీ పట్టుకుంటారు. కేసు నమోదు చేసి.. ఏసీబీ కోర్టులో సరెండర్ చేయిస్తారు. ఇది మనం ఇన్నాళ్లుగా చూస్తున్న, వింటున్న ఏసీబీ వ్యవహారం తీరు.. కానీ ఇప్పుడు ఏసీబీ తన పాత పంథాను కొనసాగిస్తూనే సరికొత్త అడుగులను వేస్తోంది. అవినీతి చేసిన అధికారులను మాత్రమే పట్టుకుంటే సరిపోదని, వ్యవస్థీకృతంగా మారిన అవినీతిని నివారించాలంటే దాని మూలాలను నిర్మూలించాలని భావిస్తోంది. ప్రభుత్వం నుంచి కూడా గో ఎహెడ్ పాలసీ ఉండటంతో ఏసీబీ అధికారులు తమ పనిని విస్తృతం చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకత్వంలో కొన్ని కీలక శాఖలపై దృష్టి సారిస్తున్నారు. సంబంధిత నివేదికలను తయారుచేసి ప్రభుత్వానికి అందించడం ద్వారా పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా వివిధ తనిఖీలకు అవినీతి నిరోధకశాఖలోని అధికారులను విశ్వసించి.. వినియోగిస్తోంది. ఒక్కొక్క శాఖలో వ్యవస్థీకృత అవినీతిపై దృష్టి సారిస్తోంది. మొదటి దశలో జనబాహుళ్యంలో అవినీతి జరిగే శాఖలు అని పేరున్న వాటిపై నజర్ పెట్టింది. దీంతో ఆయా శాఖల్లో ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో.. ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకుని తమ ఆదాయానికి గండి వేస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఒక అవినీతి దారిని మూసివేస్తే పలు దారులు చూసుకునే అక్రమార్కులపై తర్వాత కూడా దృష్టి సారిస్తే ఫలితం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గురుకులాలతో మొదలు
ఏసీబీ కేవలం అవినీతి అధికారులను పట్టుకోవడమే కాకుండా తనిఖీలను విస్తృతం చేయడం గురుకుల పాఠశాలలతో మొదలైంది. ఉమ్మడి జిల్లాలో ఏసీబీ ఈ రెండేళ్లలో పదుల సంఖ్యలో అవినీతి అధికారులను పట్టుకున్నది. గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించకపోవడంతో తరచూ ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో సర్కారు ఏసీబీ అధికారులతో తనిఖీలు చేయించింది. వారు కూరగాయల నాణ్యత, వంట పదార్థాలు, హైజీన్ వాతావరణం సరిగా లేదని, నాసిరకం సరుకులు వాడుతున్నారని రిపోర్టు ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ గురుకులంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దీనికి కారణం మెస్ చార్జీలు చాలకపోవడం అని తెలిశాక.. ప్రభుత్వం ఆ చార్జీలను పెంచింది. 3 తరగతి నుంచి 7వ తరగతి వరకు రూ. 950గా ఉంటే రూ. 1330కి, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ. 1100 ఉంటే రూ. 1540కి, ఇంటర్మీడియట్ ననుంచి పీజీ వరకు రూ. 1500 ఉంటే రూ. 2100లకు పెంచింది. 2024 ఆగస్టులో ఏసీబీ తనిఖీలు చేసి నివేదిక ఇచ్చిన తర్వాత అదే సంవత్సరం నవంబరులో 40 శాతం డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. అలాగే కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచింది. ఏసీబీకి ఇస్తే కచ్చితమైన నివేదికలు వస్తాయని భావించిన ప్రభుత్వం ఈ విధంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఆర్టీఏ చెక్‌పోస్టుల మూసివేత
రవాణాశాఖ చెక్ పోస్టుల్లో అవినీతిపై గత సంవత్సరమే దృష్టి సారించిన ప్రభుత్వం.. వ్యవస్థీకృత అవినీతిని అరికట్టే బాధ్యతను ఏసీబీకి అప్పగించింది. 2024 మే, జూన్ నెలల్లో ఒకసారి రూ. 2.70లక్షలు, మరోసారి రూ. 1.92 లక్షలు, లెక్కల్లోకి రాని నగదును సీజ్ చేశారు. ఈ అవినీతి పరిణామాలపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్డీవో చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ తీర్మానం చేసింది. అయితే ఆ తర్వాత కూడా కొద్ది రోజులు కొనసాగగా.. అక్టోబర్ 18, 19 తేదీల్లో కూడా చెక్‌పోస్టుల్లో ఏసీబీతో మరోసారి తనిఖీలు చేయించారు. ఆ సమయంలో గద్వాల జిల్లాలోని జల్లాపురం వద్ద, నారాయణపేట జిల్లా కృష్ణా వద్ద తనిఖీలు చేయగా.. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో రూ. 74 లక్షలు లెక్కల్లోకి రాని నగదు దొరికింది. దీంతో రవాణాశాఖ చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల చెక్‌పోస్టుల్లో అవినీతికి చెక్ పడింది. అయితే ఇంకా ఆర్టీవో కార్యాలయాల వద్ద ఉన్న ఏజెంట్లు, వారి వద్ద నుంచి వసూళ్లపై, మొబైల్ చెకింగ్ వాహనాల ద్వారా జరుగుతున్న దోపిడీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ఎస్‌ఆర్‌వోల వంతు
పై రెండింటి నివేదికలతో ఎంతో కొంత మార్పురాగా.. ప్రస్తుతం ఏసీబీ ఫోకస్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలపై పడింది. ఇక్కడ కూడా వ్యవస్థీకృత అవినీతికి కొదువ లేదు. డాక్యుమెంట్ చేయాలంటే ఇంత చార్జ్ అని వసూలు చేసేవారు.. డాక్యుమెంట్ రైటర్ల మాటున అడ్డగోలు డబ్బులు వసూలు చేయడం, దానికి కట్టడి లేకపోవడం.. అందులో కొంత మొత్తం అధికారులకు ఇవ్వడం షరా మామూలే.. ఇటీవల వనపర్తి సబ్ రిజిస్ర్టార్ ఆఫీసులో దాడులు చేయగా.. డాక్యుమెంట్ రైటర్లు ఎక్కువగా ఉండటం, అనధికారిక వ్యక్తుల సంచారం ఉండటాన్ని గమనించారు. ఫోన్‌లు, ఇతర టెక్నికల్ డేటాను తీసుకున్నారు. వాటి నుంచి సేకరించిన సమాచారం ద్వారా ఎలాంటి అవినీతి జరుగుతుందో తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. వనపర్తితో పాటు మరికొన్ని చోట్లా అదేరోజు దాడులు చేశారు. ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎదురుచూడాలి. దీంతోపాటు మరికొన్ని ‘మామూళ్ల’ శాఖలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. పై రెండింటి నివేదికలతో ఎంతో కొంత మార్పురాగా.. ప్రస్తుతం ఏసీబీ ఫోకస్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలపై పడింది. ఇక్కడ కూడా వ్యవస్థీకృత అవినీతికి కొదువ లేదు. డాక్యుమెంట్ చేయాలంటే ఇంత చార్జ్ అని వసూలు చేసేవారు.. డాక్యుమెంట్ రైటర్ల మాటున అడ్డగోలు డబ్బులు వసూలు చేయడం, దానికి కట్టడి లేకపోవడం.. అందులో కొంత మొత్తం అధికారులకు ఇవ్వడం షరా మామూలే.. ఇటీవల వనపర్తి సబ్ రిజిస్ర్టార్ ఆఫీసులో దాడులు చేయగా.. డాక్యుమెంట్ రైటర్లు ఎక్కువగా ఉండటం, అనధికారిక వ్యక్తుల సంచారం ఉండటాన్ని గమనించారు. ఫోన్‌లు, ఇతర టెక్నికల్ డేటాను తీసుకున్నారు. వాటి నుంచి సేకరించిన సమాచారం ద్వారా ఎలాంటి అవినీతి జరుగుతుందో తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. వనపర్తితో పాటు మరికొన్ని చోట్లా అదేరోజు దాడులు చేశారు. ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎదురుచూడాలి. దీంతోపాటు మరికొన్ని ‘మామూళ్ల’ శాఖలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.