Share News

సీఎం హోదాలో తొలిసారి

ABN , Publish Date - May 18 , 2025 | 11:29 PM

నల్లమల బిడ్డగా తరుచు ప్రస్తావించుకునే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో నేడు తొలిసారి

సీఎం హోదాలో తొలిసారి
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తున్న రేవంత్‌ రెడ్డి (ఫైల్‌ )

నేడు మాచారం రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

రూ.12,600 కోట్లతో చేపట్టనున్న ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభోత్సవం

నాగర్‌కర్నూల్‌/అమ్రాబాద్‌/వంగూరు, మే 18 (ఆంధ్రజ్యోతి) : నల్లమల బిడ్డగా తరుచు ప్రస్తావించుకునే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో నేడు తొలిసారి ఈ ప్రాంతంలో పర్యటించున్నారు. అడవి బిడ్డల అభ్యున్నతి కోసం రూపొందించిన ఇందిరా సౌర గిరి జలవికాసం పథకానికి నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారం గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని దాదాపు రూ.12,600 కోట్ల వ్యయంతో ఆయన సోమవారం అంకురార్పణ చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏ ర్పాట్లను కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గ్వైకాడ్‌ రఘునాథ్‌ అదనపు ఎస్పీ రామేశ్వర్‌రావు పరిశీ లించారు. అదేవిధంగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్‌రెడ్డి రాను న్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు.

నల్లమలతో సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రత్యేక అనుబంధం

నలమల్లతో సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పుట్టి పెరిగిన ఊరు వంగూరు మండలం కొండారెడ్డిపల్లి. నల్లమలలో అంతర్భాగంగా ఉంది. పీసీసీ స్థాయిలో ఉండి అచ్చంపేటలో 2021 ఫిబ్రవరి 7న అచ్చంపేటలో రాజీవ్‌ రైతుదిశ సభను నిర్వహించి అచ్చంపేట నుంచి హైదారాబాద్‌ వరకు పాదయాత్ర చేయడం సంచలనమైంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి తన వాదనను చట్ట సభల్లో వినిపించారు. తనకు ఇష్టమైన నల్లమలకు సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి రానున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, వివిధ సంఘాల నాయకులు సమాయత్తం అవుతున్నారు.

పరిష్కారానికి నోచుకోని సమస్యలు

నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించి చెం చుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఉమ్మడి రాష్ట్రం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, ఆ తర్వాత తెలంగాణ అప్పటి గవర్నర్‌ తమిళిసై ప్రత్యేక నిధులు కేటాయించినా ఆ నిధులు చెంచుల దరి చేరలేదని ఆరోపణలు ఉన్నాయి. నేటి ముఖ్యమంత్రి పర్యటన తర్వాత అయిన చెంచు పెంటలకు రక్షిత మంచినీరు, విద్య, వైద్య సదుపాయం అందుతుందనే ఆశాభావంతో ఆడవి బిడ్డలు ఎదురు చూస్తున్నారు.

Updated Date - May 18 , 2025 | 11:29 PM