Share News

లేబర్‌ కార్డుతో ఆర్థిక భరోసా

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:10 PM

పని చేస్తేనే పూట గడిచే భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌ కార్డుతో ఆర్థిక భరోసా లభిస్తుందంటున్నారు నారాయణపేట జిల్లా కార్మిక శాఖ అధికారి మహేశ్‌ కుమార్‌.

లేబర్‌ కార్డుతో ఆర్థిక భరోసా
ఆంధ్రజ్యోతితో మాట్లాడుతున్న మహేశ్‌ కుమార్‌

పిల్లల చదువులకు ఉపకార వేతనం

గృహ నిర్మాణానికి సాయం.. చనిపోతే బీమా

‘ఆంధ్రజ్యోతి’తో నారాయణపేట జిల్లా కార్మిక శాఖ అధికారి మహేశ్‌ కుమార్‌

నారాయణపేట టౌన్‌ నవంబరు 12 (ఆంఽధ్రజ్యోతి): పని చేస్తేనే పూట గడిచే భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌ కార్డుతో ఆర్థిక భరోసా లభిస్తుందంటున్నారు నారాయణపేట జిల్లా కార్మిక శాఖ అధికారి మహేశ్‌ కుమార్‌. వారితో పాటు సెంట్రింగ్‌, ప్లంబర్‌, ప్లోరింగ్‌, పెంటింగ్‌, కరెంట్‌ పనులు చేసే కార్మికులకు కూడా దీని వల్ల లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు..

లేబర్‌ కార్డు అంటే ఏంటి?

లేబర్‌ కార్డు అనేది కార్మికుల గుర్తింపు పత్రం. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాల్లో కార్మికులు నేరుగా లబ్ధి పొందుతారు. కుటుంబం భవిష్యత్తు, భద్రత కోసం లేబర్‌ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి.

లేబర్‌ కార్డులతో ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?

వైద్య సాయం అందుతుంది. పిల్లల చదువుకు ఉపకార వేతనాలు, గృహ నిర్మాణానికి సాయం అందుతుంది. ప్రసూతి ప్రయోజనాలు అందుతాయి. ప్రమాద బీమా లభిస్తుంది. చనిపోతే ఆర్థిక సాయం వస్తుంది.

ఈ కార్డు పొందేందుకు ఎవరు అర్హులు?

లేబర్‌ కార్డు పొందేందుకు నిర్మాణ పనులు చేసేవారు అర్హులు. వారితో పాటు మేస్ర్తీలు, డైృవర్‌, ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, ప్లంబర్‌, టైలర్‌, వెల్డర్‌ వంటి వృత్తులు చేసే వారు కూడా అర్హులే. 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న వారు, ఏడాదిలో కనీసం 90 రోజులు పనులు చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

కార్మికుడి ఆధార్‌ కార్డు, నామిని ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, రెండు ఫొటోలు బ్యాంక్‌ అకౌంట్‌తో మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పత్రాలను లేబర్‌ కార్యాలయంలో సమర్పించాలి. వాటిని పరిశీలించిన తర్వాత కార్మికుడికి కార్డు జారీ చేస్తాము.

జిల్లాలో ఎందరికి ప్రయోజకం చేకూరింది?

జిల్లాలో ఇప్పటి పరకు దాదాపు 66 వేల మంది కార్మికులకు లేబర్‌ కార్డులు ఇచ్చాము. వారికి వివిధ పథకాల కింద గత ఏడాది రూ.13,37,13,240 మంజూరయ్యాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి, ప్రసూతి సాయం, సహజ మరణాలు, ప్రమాద మృతుల కుటుంబాలకు వీటిని అందజేశాం.

Updated Date - Nov 12 , 2025 | 11:10 PM