Share News

కాళేశ్వరం పేరిట ఆర్థిక దోపిడీ

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:12 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఖర్చుల పేరిట ఆర్థిక దోపిడీ జరిగిందని ఇందుకు కేసీఆర్‌, ఆయన కేబినెట్‌ బాధ్యత వహించాల్సిందేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు.

కాళేశ్వరం పేరిట ఆర్థిక దోపిడీ
మాట్లాడుతున్న మిథున్‌రెడ్డి

- టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మిథున్‌రెడ్డి, సంజీవ్‌ముదిరాజ్‌

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఖర్చుల పేరిట ఆర్థిక దోపిడీ జరిగిందని ఇందుకు కేసీఆర్‌, ఆయన కేబినెట్‌ బాధ్యత వహించాల్సిందేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ముదిరాజ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. సాగునీటి కోసం నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు కమీషన్‌ యంత్రంగా మార్చుకున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, కేబినెట్‌ నిర్ణయాలు లేకుండా కేసీఆర్‌ సొంత నిర్ణయం తీసుకున్నారని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ 650 పేజీల నివేదికను సమర్పించడం జరిగిందని గుర్తుచేశారు. సిట్‌, సీఐడీ కాకుండా పూర్తి నిష్పాక్షికత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయని, అందుకే మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగిపోయారని చెప్పారు. యూరియా విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీలు కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. రావాల్సిన కోటా రాకుండా యూరియా సరఫరాను నిలువరించి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. నాయకులు లక్ష్మణ్‌యాదవ్‌, మల్లు నరసింహారెడ్డి, సిరాజ్‌ఖాద్రి, సీజె బెనహర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:12 PM