Share News

ఆర్థిక భారం..

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:32 PM

నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను చేపడుతుంది.

ఆర్థిక భారం..
పెద్దాపూర్‌లో రేకులతో వేసిన ఇంట్లో ఉంటున్న లబ్ధిదారురాలు గోరటి అంజమ్మ

- మొదలుకాని ఇందిరమ్మ ఇంటి నిర్మాణం

- మంజూరై నెలలు కావస్తున్నా తప్పని ఇబ్బందులు

వెల్దండ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను చేపడుతుంది. సదుద్దేశంతో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన కొందరు తమ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండడంతో కనీసం పనులు ప్రారంభించలేకపోతున్నారు. అభయహస్తంలో భాగంగా ఇంటి నిర్మాణాలను చేపడుతున్న వారికి ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో 5 లక్షల రూపాయలు విడతల వారీగా లబ్ధిదారులకు అందనుంది. కాగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరై నెలలు కావస్తున్నా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో కనీసం ప్రారంభించలేని దీనస్థితిలో ఉన్నారు. వారిలో నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన గోరటి అంజమ్మ ఒకరు. రెండు దశాబ్దాల క్రితం భర్త చనిపోగా, ఉన్నత చదువులు చదివినా కొడుకుకు ఉద్యోగం రాక పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో ఇళ్లు లేని అంజమ్మ తాత్కాలికంగా రేకులతో ఏర్పాటుచేసిన డబ్బాలో ఉంటుంది. ఈ క్రమంలో అంజమ్మకు గత జూన్‌ నెలలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యింది. ఇళ్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నా డబ్పులు లేని కారణంగా నేటివరకు ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టలేదు. కనీసం బేస్‌మెంట్‌ నిర్మాణం చేపడితే మొదటి విడతలో లక్ష రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నా ప్రారంభానికి సైతం ఇబ్బందులు తప్పడంలేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులను కలిసి తమకు మహిళా సంఘాల ద్వారానైనా రుణం ఇప్పించాలని కోరినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఇంటి నిర్మాణానికి సహకరించాలని అంజమ్మ కోరారు.

ఇంటి నిర్మాణానికి తోడ్పాటునందిస్తాం

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అంజమ్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి తమవంతు తోడ్పాటునందిస్తాం. గ్రామంలో ఇళ్లులేని నిరుపేద లబ్ధిదారులందరికీ ఇళ్లు ఉండాలనే సదుద్దేశంతో పథకం అమలవుతుంది. ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బాధిత లబ్దిదారురాలికి అండగా ఉంటా.

- కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ కేశమళ్ల కృష్ణ

Updated Date - Dec 19 , 2025 | 11:32 PM