యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:39 PM
గత నాలుగైదు రోజులుగా యూరియా కోసం రైతు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వడ్డేపల్లి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గత నాలుగైదు రోజులుగా యూరియా కోసం రైతు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం శాంతినగర్ సహకార సొసైటీ దగ్గర యూరియా కోసం రైతులు గొడవ పడుతుండటంతో శాంతినగర్ ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి అక్కడి చేరుకుని రైతులతో మాట్లాడి ఇబ్బందిలేకుండా యూరియా పంపిణీ చేయించారు. రెండు సంచుల యూరియా కోసం పనులు వదులుకుని ఉదయం నుంచి సాయంకాలం వరకు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఈ సందర్బంగా పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. క్యూలైన్‌లో నిలబడి యూరియా తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం తమ ఇబ్బందులను గమనించి, యూరియాను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని కోరారు. నాలుగు ఎకరాల పొలానికి రెండు సంచుల యూరియా ఎలా వేయాలని రైతులు ప్రశ్నించారు. పాస్‌బుక్కులో పది ఎకరాలు ఉన్నా రెండు సంచులే ఇస్తే, ఏం చేసుకుంటామని, పొలాన్ని బట్టి యూరియా ఇవ్వాలని అన్నారు.