Share News

ముట్టితో రైతులకు తప్పని తిప్పలు

ABN , Publish Date - May 23 , 2025 | 11:05 PM

వ్యయ, ప్రయాసలకు ఓర్చి పండించిన ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముట్టితో రైతులకు తప్పని తిప్పలు
బాదేపల్లి పత్తి మార్కెట్‌ వద్ద చాటతో గోనె బస్తాలోకి ధాన్యం నింపుకుంటున్న రైతు రాజు

- పత్తాలేని పర్యవేక్షించాల్సిన అధికారులు

- బాదేపల్లి పత్తి మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఇక్కట్లు

జడ్చర్ల, మే 23 (ఆంధ్రజ్యోతి) : వ్యయ, ప్రయాసలకు ఓర్చి పండించిన ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 40 కిలోల బస్తాకు ఏకంగా రూ.25.70 ఖర్చును భరిస్తున్న రైతులను ముట్టితో చాటకూలీలు వేధిస్తున్న తీరు వర్ణనాతీతం. పర్యవేక్షించాల్సిన అధికారుల పత్తా లేకపోవడంతో చాటకూలీలు ఇష్ఠారీతిలో వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయ క్షేత్రం నుంచి కొనుగోలు కేంద్రానికి ట్రాక్టర్‌లో తెచ్చిన ధాన్యంను రైతు కుప్పగా పోసుకుంటారు. కానీ అన్‌లోడింగ్‌, కుప్పగా పోసామంటూ చేయని హమాలీకి రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఒక్కో విధంగా 40 కిలోల బస్తాకు కనీసంగా రూ.23 నుంచి రూ.25.70 వసూలు చేస్తున్నారు. ఇందులో ట్రాక్టర్‌లో నుంచి అన్‌లోడింగ్‌ చేయడం వాటిని కుప్పగా పోయడం, తూకంకు బస్తాలు అందించడం, తూకం వేసిన అనంతరం లారీలో లోడింగ్‌ చేయడానికి రూ.17.55 హమాలీ వసూలు చేస్తున్నారు. వీటితో పాటు కుప్పగా పోసిన ధాన్యం గోనె బస్తాల్లో నింపడానికి చాట కూలీలు బస్తాకు రూ.3 వసూలు చేస్తున్నారు. అదే విధంగా ముట్టి పేరుతో దాదాపు 50 కిలోలకు పైగా ధాన్యం రైతుల నుంచి దర్జాగా తీసుకుంటున్నారు. ఏంటని ప్రశ్నించిన రైతులపై ఎగబడుతున్నారు. బాదేపల్లి పత్తి మార్కెట్‌లో బాదేపల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంకు కోల్‌బాయితండాకు చెందిన రాజు అనే రైతు దాదాపు 200 బస్తాల ధాన్యంను తీసుకొచ్చి రెండు కుప్పలుగా పోసుకున్నాడు. సుమారు 75 బస్తాలు ఉన్న ధాన్యం తూకం కోసం గోనె బస్తాలలో చాట కూలీలు నింపారు. చివరగా 50 నుంచి 70 కిలోల ధాన్యంను ముట్టిగా ఇవ్వాలంటూ రైతుపై దౌర్జన్యానికి దిగారు. గోనెబస్తాల్లో నింపడానికి మరొ కుప్ప ఉందని, వాటిని నింపిన సందర్భంలో ముట్టి ఇస్తానంటూ సదరు రైతు చెప్తున్నా చాటకూలీలు వినిపించుకోలేదు. సదరు రైతుకు చెందిన 75 బస్తాలు నింపినందుకు బస్తాకు రూ.3 చొప్పున రూ.225ను చాటకూలీలకు చెల్తిస్తున్నాడు. ప్రభుత్వం నిర్దేశించిన ధర అంటే క్వింటాలుకు రూ.2300 చొప్పున దాదాపు 50 కిలోలకు రూ.1150 అదనంగా ముట్టి పేరుతో రైతు నుంచి వసూలు చేస్తున్నారు.

Updated Date - May 23 , 2025 | 11:05 PM