Share News

రైతు భరోసా సాగ..గదీత

ABN , Publish Date - Apr 11 , 2025 | 10:53 PM

రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసి.. దిగుబడి లేకనో, ధర రాకనో నష్టం వస్తే దానిని తీర్చలేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది.

రైతు భరోసా సాగ..గదీత
నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం పూసల్‌పహడ్‌లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట

మార్చి 31 వరకే పెట్టుబడి సాయం పూర్తి చేస్తామన్న ప్రభుత్వం

ఇప్పటి వరకు నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న వారి ఖాతాల్లోనే డబ్బులు జమ

ఉమ్మడి జిల్లాలో రూ.1,358 కోట్లకు గాను అందింది రూ.830 కోట్లే..

ముంచుకొస్తున్న మరో సీజన్‌

ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లపై ఫోకస్‌..

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసి.. దిగుబడి లేకనో, ధర రాకనో నష్టం వస్తే దానిని తీర్చలేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు ఇచ్చింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఒక విడత రైతుబంధు పేరుతోనే పెట్టుబడి సాయం అందజేయగా తరువాత సీజన్‌లో సాయం ఇవ్వలేదు. రైతు భరోసా పథకం అమలు కోసం మార్గదర్శకాలు సిద్ధం చేయడంలో ఆలస్యం జరగడం అందుకు ఒక కారణం. అయితే ఆ తరువాత ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 26న సీఎం రేవంత్‌ రెడ్డి పథకాన్ని ప్రారంభించారు. మార్చి 31వ తేదీ వరకు పంటలు సాగు చేసిన ప్రతీ ఒక్కరి ఖాతాల్లో డ బ్బులు జమ చేస్తామని ప్రకటించారు. ఆ గడువు ముగిసి కూడా 12 రోజులు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు నా లుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే డబ్బులు జమ చే శారు. మిగిలిన వా రంతా ఆ సాయం ఎప్పుడు అందుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భరోసా పేరుతో ఒక సీజన్‌లో డబ్బులు రాలేదు. కానీ ఆ సమయంలో అందరికీ రుణమాఫీ కావడంతో రైతుల నుంచి కూడా పెద్దగా నిరసన రాలేదు. కానీ ప్రస్తుత సీజన్‌లో నగదు జమ కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. యాసంగి సీజన్‌ ముగిసి, మరో సీజన్‌ వస్తుండడంతో డబ్బులు ఎప్పుడు వేస్తారని అడుగుతున్నారు.

రూ.830 కోట్లు మాత్రమే జమ..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతు భరోసా కింద రూ.1,358 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులు ట్రెజరీకి పంపించారు. కానీ ఇప్పటి వరకు రూ.830 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. ఇంకా రూ.528 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు నాలుగు ఎకరాల్లోపు వారికే డబ్బులు అందాయి. అందులో మెజారిటీ సన్నకారు రైతులే ఉన్నారు. అయితే భూమిపై ఎలాంటి సీలింగ్‌ను ప్రభుత్వం విధించలేదు. కేవలం సాగు యోగ్యం కానీ, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను అందులో నుంచి మినహాయించింది. ఉమ్మడి జిల్లాలో 24.71 లక్షల ఎకరాలను గుర్తించారు. పాత జాబితాలో 33,182 ఎకరాలు సాగుకు యోగ్యం కాదని తొలగించారు. వాటికి భరోసా వేయలేదు. అయితే ఇంకా ఆలస్యం అవుతుండడంతో ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిధులలేమి సమస్యతో చాలా పథకాలు అందకపోగా, మెజారిటీ వర్గానికి ఉపయోగపడే రైతు భరోసాపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

కొనుగోళ్లపై ఫోకస్‌

యాసంగి కోతలు ప్రారంభ మయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. ప్రభుత్వం కూడా కొనుగోళ్లపై ఫోకస్‌ పెట్టి, కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఇప్పుడు ఆ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వానికి నిధులు అవసరం. అలాగే సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులకు బోనస్‌ ఇవ్వాలి. గత సీజన్‌లో బోనస్‌ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. ఈ నేపథ్యంలో అటు రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, సన్నాలకు బోనస్‌ అందుతాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి 10.05 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా, అందుకోసం 1,002 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తే బోనస్‌ కాకుండానే రూ.2,300 కోట్లు అవసరం కానున్నాయి.

Updated Date - Apr 11 , 2025 | 10:53 PM