Share News

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్‌ ఐడీ

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:18 PM

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ పక్షాన అందించే పథకాలు రైతులకు లబ్ధి చేకూరేందుకు ఫార్మర్‌ ఐడీ కార్యక్రమాన్ని చేపట్టింది.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్‌ ఐడీ
పోలేపల్లిలో ఫార్మర్‌ ఐడీ నమోదు చేస్తున్న ఏఈవో శారద (ఫైల్‌)

- 11 అంకెలతో ప్రత్యేక నెంబరు కేటాయింపు

- కిసాన్‌ సమ్మాన్‌ నిధి, సాయిల్‌ హెల్త్‌కార్డు, ఫసల్‌ బీమా యోజన వంటి పథకాలకు అమలు

జడ్చర్ల, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ పక్షాన అందించే పథకాలు రైతులకు లబ్ధి చేకూరేందుకు ఫార్మర్‌ ఐడీ కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు వర్తింపజేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు ఫార్మర్‌ ఐడీని యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఫార్మర్‌ ఐడీకి ఆధార్‌, పట్టాదారు పుస్తకం, ఫోన్‌ నెంబర్లను లింక్‌ చేస్తున్నారు. ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన ఫార్మర్‌ ఐడీకి ప్రత్యేక నెంబరును కేటాయిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రైతుకు ఆధార్‌ నెంబరు మాదిరిగా ఫార్మర్‌ ఐడీని కేటాయించనుండటంతో ఫార్మర్‌ ఐడీని ఓపెన్‌ చేస్తే రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇందులో భూమి రకం, సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటలు తదితర అంశాలు నమోదు చేస్తున్నారు. ఫార్మర్‌ ఐడీతో రైతు సాగు చేసే వివరాల చిట్టా ఒక్క క్లిక్‌తో బహిర్గతం కానుంది. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ నిధి, సాయిల్‌ హెల్త్‌కార్డు, ఫసల్‌ బీమా యోజన వంటి పథకాలు అమలు పరిచేందుకు ఈ ఫార్మర్‌ ఐడీ విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు వివరిస్తూ, గ్రామాల్లో ఏఈవోలతో ఫార్మర్‌ ఐడీ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, రైతు భీమా పథకాలకు ఈ ఫార్మర్‌ ఐడీ అవసరం లేదని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఫార్మర్‌ ఐడీ కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలకు మాత్రమే వర్తిస్తుందని వివరిస్తున్నారు. యాప్‌లో రైతుకు సంబంధించిన ఆధార్‌ నెంబరు నమోదు చేసిన సందర్భంలో, రైతు వివరాలు నమోదు చేసిన సందర్భంలో, ఫోన్‌ నెంబరు నమోదు చేసిన సందర్భంలో రైతు మొబైల్‌కు వచ్చే ఓటీపీలతో ఫార్మర్‌ ఐడీని క్రియేట్‌ చేస్తున్నారు.

జిల్లాలోని 2.50 లక్షల మంది రైతులకు ఫార్మర్‌ ఐడీలు

పాలమూరు జిల్లాలోని 2.50 లక్షల మంది రైతులకు ఫార్మర్‌ ఐడీలు నమోదు చేస్తున్నాం. కేంద్రం అందించే పథకాలు ఫార్మర్‌ ఐడీ కలిగిన రైతులకు వర్తిస్తాయి. ఒక గుంట నుంచి మూడు ఎకరాలలోపు ఉన్న రైతులే జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. ఇప్పటికే 2.14 లక్షల మందికి రైతుబంధు పథకం లబ్ధి పొందుతున్నారు. పథకాలు ట్యాక్స్‌ పేయర్స్‌కు వర్తించవు. ఫార్మర్‌ ఐడీ రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలకు అవసరం లేదు.

- వెంకటేష్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Updated Date - Jun 15 , 2025 | 11:18 PM