Share News

నకిలీ నోట్లు స్వాధీనం

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:02 PM

నకిలీ నోట్లను చెలామణి చేసిన నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు జడ్చర్ల సీఐ కమలాకర్‌ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో ఇద్దరు మైనర్‌లు ఉన్నారని చెప్పారు. వారి వద్ద రూ.9,600 నకిలీ నోట్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నకిలీ నోట్లు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు

నలుగురు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన జడ్చర్ల సీఐ

జడ్చర్ల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): నకిలీ నోట్లను చెలామణి చేసిన నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు జడ్చర్ల సీఐ కమలాకర్‌ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో ఇద్దరు మైనర్‌లు ఉన్నారని చెప్పారు. వారి వద్ద రూ.9,600 నకిలీ నోట్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జడ్చర్ల పోలీ్‌స స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జడ్చర్ల పట్టణానికి చెందిన ఓ మైనర్‌ వెంకటేశ్వరకాలనీలోని ఓ కిరాణ దుకాణంలో నకిలీ రూ.500 నోటును చెలామణి చేస్తూ ఆదివారం పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, మరో మైనర్‌ తనకు ఆ నోట్లు ఇచ్చాడని తెలిపాడు. నకిలీ నోట్లను ఇచ్చిన మైనర్‌ను పట్టుకునేందుకు వెళ్తుండగా అవి ఇచ్చిన మైనర్‌ బాలుడితో పాటు మరో ఇద్దరు కారులో ఉండగా పట్టుకున్నామని చెప్పారు. బాలుడితో పాటు రాజాపూర్‌ మండలం చెన్నవల్లి గ్రామానికి చెందిన పిట్టల శివకుమార్‌, చెన్నయ్యల వద్ద సోదాలు చేయగా రూ.500 నోట్లు 14, రూ.200 నోట్లు 13 లభ్యమయ్యాయని వివరించారు. వారిని విచారణ చేయగా తమకు మరో వ్యక్తి నకిలీ నోట్లును ఇచ్చాడని, వాటిని తాము కేవలం చెలామణి చేస్తామని విచారణలో తెలిపారన్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాలలో, పెద్ద మనుషులు, చిన్నవాళ్లు ఉన్న దుకాణాలలో అనుమానం రాకుండా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లు వారు వివరించారని చెప్పారు. గడిచిన మూడు నెలలుగా సుమారు రూ.2 లక్షల మేర ఆ నోట్లను చెలామణి చేసినట్లు తెలిపారు. నకిలీ నోట్లను ఇచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. నకిలీ నోట్ల విషయంలో పట్టణ ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో జడ్చర్ల ఎస్‌ఐ జయప్రసాద్‌, క్రైం కానిస్టేబుల్స్‌ విష్ణు, నరసింహ ఉన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:02 PM