Share News

‘పది శాతం’ భూమిపై కన్ను

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:19 PM

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని జమ్మిచేడు దాని పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉంది.

‘పది శాతం’ భూమిపై కన్ను
వెంచర్‌కు అడ్డుగా రోడ్డును త్రవేసిన దృశ్యం

- స్వాధీనం చేసుకునేందుకు కుట్ర

- పసిగట్టి రాత్రికి రాత్రే దేవుళ్ల విగ్రహాలు

- మరో వెంచర్‌ దారుడికి బెదిరింపులు

- పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు

గద్వాల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని జమ్మిచేడు దాని పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉంది. గద్వాల - కర్నూల్‌ ప్రధాన రోడ్డు కావడంతో రోడ్‌సైడ్‌ ప్లాట్‌ ధర రూ.కోటికి పైగా పలుకుతుంది. ఈజీగా డబ్బు సంపాదించే వారు కొందరు, వెంచర్‌దారులను భయపెట్టించి వారితో భారీగా ముడుపులు తీసుకుంటుంటారు. ఇవ్వకపోతే నానా హంగామా చేస్తారు. వీటిలో చాలా వరకు గుట్టుగా రాజీ చేసుకుంటారు. కొన్ని మాత్రమే బయటకు వస్తాయి. ఆలాంటి సంఘటనే జమ్మిచేడు పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయం సోషల్‌ మీడియాలోనూ ట్రోల్‌ అవుతున్నది.

కాపాడుకునేందుకు యత్నం

గద్వాల మునిసిపాలిటీ పరిధిలోని జమ్మిచేడులో గద్వాల - కర్నూల్‌ రోడ్డు పక్కన కొనేళ్ల క్రితం ఓ వెంచర్‌ను అనుమతి లేకుండా ఏర్పాటు చేశారు. భూ యజమానులు, వెంచర్‌దారుడు అందులో పది శాతం భూమిని వదిలి ప్లాట్లను విక్రయించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేశారు. దాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చుకోలేదని కూడా తెలిసింది. అనుమతి లేని వెంచర్‌ కావడంతో వదిలిన పది శాతం భూమి యజమాని పేరుపైనే ఉంది. ఆ భూమి పక్క నుంచి సమీపంలోని గ్రామ దేవత వరకు రోడ్డు ఉంది. దీంతో ఎలాగైనా ఆ పది శాతం భూమిని రిజిష్ర్టేషన్‌ చేయించుకోవాలని కొందరు ‘పెద్ద మనుషులు’ పథకం వేశారు. విషయం తెలిసిన కాలనీవాసులు రాత్రికి రాత్రే అక్కడ ఓ షెడ్డు వేసి శివుడు, విఘ్నేశ్వరుడు, నంది విగ్రహాలను ఏర్పాటు చేశారు. వారి పన్నాగం విఫలమైంది. ఈ సంఘటన 20 రోజుల క్రితం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ లేకుండా దేవుళ్లను పెడితే ఊరికి అరిష్టం జరుగుతుందని ప్రజలను భయపట్టేందుకు యత్నించారు. కానీ వారికి స్థానికుల మద్దతు లభించలేదు. దీంతో అసహానానికి గురైన సదరు పెద్ద మనుషులు దాని పక్కనే ఉన్న వెంచర్‌దారుడిపై పడ్డారు.

రూ.40 లక్షలు డిమాండ్‌

ఇటీవల అదే వెంచర్‌ పక్కన అనుమతుల(0006/ఎల్‌ఓ/3059/2024)తో మరో వెంచర్‌ వెలిసింది దాని యజమానులు నిబంధనల ప్రకారం రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేసి, పది శాతం భూమిని వదిలారు. అయితే ఆ వెంచర్‌దారుడు దాని ముందున్న వెంచర్‌లో 25 ఫీట్ల భూమిని కలుపుకొని 40 ఫీట్ల రోడ్డు వేశారు. కలుపుకున్న భూమి విలువ రూ.60 లక్షలు ఉంటుంది.. చివరగా రూ.40 లక్షలు ఇవ్వాలంటూ అతడిపై బెదిరింపులకు దిగారు. వారు భయపడక పోవడంతో గత నెల 30వ తేదీన రోడ్డుకు అడ్డంగా సిమెంట్‌ దిమ్మెలను పాతారు. దీంతో వెంచర్‌ యజమానులు దిలీప్‌కుమార్‌ రెడ్డి, నర్సింహులు, జనార్దన్‌గౌడ్‌లు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పిలిచి సర్దిచెప్పి పంపించేశారు. దీంతో ఆ పెద్ద మనుషులు ‘మా పైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా...? మీరు ప్లాట్లు ఎలా విక్రయిస్తారో చూస్తాం’ అంటూ గురువారం తెల్లవారుజామున ఎక్స్‌కవేటర్‌తో రోడ్డుకు అడ్డంగా గుంతలు తవ్వారు. దీంతో వెంచర్‌లోనికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఆ వెంచర్‌ యజమానులు మరోసారి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వెనుకడుగు!

జమ్మిచేడు, దాని పరిసర ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సదరు వ్యక్తుల వెనక పెద్ద మనుషులు ఉండటంతో అందుకు కారణమని తెలుస్తోంది. ఈ విషయంపై రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఫిర్యాదు అందిన మాట వాస్తవమే అన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Oct 10 , 2025 | 11:19 PM