నేడు ర్యాలంపాడుకు నిపుణుల కమిటీ
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:35 PM
నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగమైన ర్యాలంపాడు లీకేజీలను పరిశీలించేందుకు పూణే నుంచి ఐదుగురితో కూడిన నిపుణుల కమి టీ గురువారం జోగుళాంబ గద్వాలకు రానున్నది.

-ఇప్పటికే రూ.144 కోట్లతో ప్రతిపాదనలు
-నిపుణుల నివేదికతో కదలిక
- లేదంటే మరో ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం
గద్వాల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగమైన ర్యాలంపాడు లీకేజీలను పరిశీలించేందుకు పూణే నుంచి ఐదుగురితో కూడిన నిపుణుల కమి టీ గురువారం జోగుళాంబ గద్వాలకు రానున్నది. ఇప్పటి కే ఇరిగేషన్‌కు చెందిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలతో రూ.144 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ వాటర్ పవర్ రిసోర్స్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌యస్) పూణేకు చెందిన నిపుణుల కమిటీ రిజర్వాయర్‌ను పరిశీలించేందుకు వస్తోంది. ఈ కమిటీ సభ్యులు దేశంలో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టులు, వరదల నియంత్రణ, హైడ్రాలిక్ నిర్మాణాలు, నౌకాశ్రయాలు, వంతెనల నిర్మాణాలు, భౌతికశాస్త్రం, గణిత నమూనాల అధ్యయనాలలో సేవలు అందించే వారు కావడంతో వారి సూచనలను తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ నిపుణుల కమిటీ గతంలో ఇచ్చిన నివేదికకు ఓకే చెబితే వెంటనే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నిపుణులు ఆ నివేదికలో మార్పులు, చేర్పులతో సూచనలు చేస్తే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
గట్టు ఎత్తిపోతలకు ర్యాలంపాడే ఆధారం..
గట్టు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు రిజర్వాయరే ఆధారం.. దీని నుంచి 2.80 టీఎంసీలను ఎత్తిపోసి 33వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇందుకోసం గజ్జలమ్మ గుట్ట దగ్గర 1.32 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అంటే గట్టు ఎత్తిపోతల పథకం విజయవంతం కావాలంటే ర్యాలయంపాడు రిజర్వాయర్ పటిష్టం కావాలి. అందుకే ప్రభుత్వం దీని మరమ్మతులపై దృష్టి పెట్టింది.
మంత్రి సమీక్షతో కదిలిక..
నెట్టంపాడు ఎత్తిపోతల పథకానికి గుండెకాయలాంటి ర్యాలంపాడు రిజర్యాయర్ లీకేజీలను అరికట్టేందుకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గత నవంబరులో ప్రాజెక్టుపై సమీక్షించడంతో ఫైల్ కదిలింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉంది. రూ.144 కోట్లతో లీకేజీలకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. రిజర్వాయర్ కట్టను కొంత తొలగించి కింది నుంచి గ్రౌటింగ్ చేస్తూ వెడల్పు చేయడం, మట్టితో గట్టిపరుస్తూ.. పాలిథిన్ షీట్స్ వేసి రిబిట్‌మెంట్ నిర్మించాలని నిర్ణయించారు. అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు సెంట్రల్ వాటర్ పవర్ రిసోర్స్ స్టేషన్ సైంటిస్టుల సూచనలు తీసుకోవాలని నిర్ణయించడంతో వారు రిజర్వాయర్‌ను పరిశీలించేందుకు పూణే నుంచి గద్వాలకు వస్తున్నారు.
ఇప్పటికే నివేదిక పంపించాం..
మరమ్మతుల కోసం రూ.144 కోట్లతో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రస్తుతం ఫైల్ ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే అత్యంత ప్రామాణికమైన నివేదికలు అందించే సీడబ్ల్యూపీఆర్‌యస్ పూణే సైంటిస్టుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ అదేశం మేరకు వారు పరిశీలించేందుకు గద్వాలకు వస్తున్నారు. వారు ఇచ్చే నివేదికతో ముందుకు వెళ్తాం..
- రహీముద్దీన్, ఎస్‌ఈ జూరాల ప్రాజెక్టు