రిజర్వేషన్లపై ఉత్కంఠ
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:28 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రిజర్వేషన్ల ఖరారు కోసం వివరాలను సీల్డ్ కవర్‌లో మంగళవారం వరకు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
సీల్డ్ కవర్లలో నివేదికను పంపించనున్న కలెక్టర్లు
నేటితో ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం
50 శాతం మహిళా కోటాను లాటరీ పద్ధతిలో తీసే అవకాశం
కుల గణనలో వచ్చిన జనాభా ఆధారంగానే రిజర్వేషన్ల ఖరారు
కలెక్టరేట్లలో అధికారులు బిజీబిజీ.. రోజంతా వీసీలు, సమీక్షల్లోనే
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రిజర్వేషన్ల ఖరారు కోసం వివరాలను సీల్డ్ కవర్‌లో మంగళవారం వరకు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్ర కారం 2024 జనవరి, ఫిబ్రవరిలో సర్పంచులకు, జూన్, జూలైలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం ఎప్పుడో సిద్ధమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా స్థా నిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హా మీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునే దిశలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే కూడా నిర్వహించింది. ఇప్పుడు ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం, అది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం, రెండు బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండటంతో కాలయాపన జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా సెప్టెంబరు 30లోపు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దానిపై తొలుత సుప్రీం కోర్టుకు వెళ్లి బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయంపై ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందని భావించినప్పటికీ.. అనూహ్యంగా రిజర్వేషన్ల కోసం సీల్డ్ కవర్‌లో నివేదిక అందించాలని కలెక్టర్లను ఆదేశించడంతో ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. సీల్డ్ కవర్లలో అందిన నివేదిక తర్వాత ప్రభుత్వం జీఓ జారీ చేసి, దాని ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది.
కులగణన ఆధారంగానే..
కులగణన ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత రిజర్వేషన్లు ఉండగా.. అలా అయితే మార్పులు, చేర్పులకు అవకాశం పెద్దగా ఉండదు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలంటే కులగణన నివేదిక ఆధారం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గత రిజర్వేషన్లు, 2011 జనాభా, స్ర్తీ, పురుష నిష్ఫత్తి వివరాలను ప్రభుత్వం కలెక్టర్ల నుంచి కోరింది. ప్రభుత్వం వద్ద ఉన్న కులగణన నివేదికను, పాత వివరాలను సరిచూసుకుని.. రిజర్వేషన్ల కేటాయింపునకు జీఓ జారీ చేస్తారు. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించాల్సి ఉండటంతో జానాభా నిష్ఫత్తిని ఆధారంగా చేసుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ముందుగా గ్రామాల్లో జనాభా నిష్ఫత్తి ప్రకారం గ్రామాన్ని ఏ కేటగిరీకి కేటాయించాలో నిర్ణయిస్తారు. సదరు కేటగిరీకి కేటాయించిన తర్వాత వాటిల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. మహిళకు కేటాయించడం అనేది లాటరీ పద్ధతిలో ఉంటుందని ప్రస్తుత అంచనాలు ఉన్నాయి. అయితే కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే లాటరీ పద్ధతిలో కేటాయిస్తారని, మిగతా వారికి జనాభా ప్రకారం కేటాయిస్తారనే అభిప్రాయం కూడా వస్తోంది. ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అందిన నివేదిక తర్వాత జీఓ ఎలా విడుదల చేస్తుందో వేచిచూడాల్సి ఉంది.
ఆందోళనలో స్థానిక నేతలు..
గ్రామాల్లో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టడంతో తమ గ్రామం ఎవరికి రిజర్వేషన్ అవుతుందోనని చర్చించుకుంటున్నారు. ఒకవేళ రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత అందరికీ కలిపి లాటరీలో మహిళలకు కేటాయింపులు చేస్తే మాత్రం చాలామంది నాయకులు తమ సతీమణులు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దింపే అవకాశం ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. స్థానిక నాయకులు పోటీకి ఉవ్విళ్లూరుతున్న సమయంలో లాటరీ పద్ధతి కేటాయింపు వారికి ప్రతిబంధంకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో ఈ విధానంలో ఎప్పుడూ కేటాయింపులు చేయకపోవడంతో ఈసారే ఎందుకు పాత విధానాన్ని అవలంభించాలనే అభిప్రాయం వస్తోంది. స్ర్తీ, పురుష నిష్ఫత్తిలో ఏ గ్రామంలో ఎక్కువగా ఉంటే మండలం యూనిట్‌గా 50 శాతం రిజర్వేషన్లు వచ్చేలా చూడాలనే అభిప్రాయం ఉంది. అయితే రొటేషన్ ప్రకారం చేయాలనే డిమాండ్ కూడా బలంగా ఉంది. అలా అయితే గతంలో మహిళలకు రిజర్వేషన్ ఉన్న గ్రామంలో ఈసారి జనరల్, జనరల్ ఉన్న స్థానంలో మహిళకు రిజర్వేషన్ వచ్చి సమన్యాయం జరుగుతుందనే అభిప్రాయం వస్తోంది. ఒకవేళ లాటరీ పద్ధతి అయితే మాత్రం ఇబ్బందులు పడతామని స్థానిక నాయకులు చెబుతున్నారు.