Share News

‘ట్రిపుల్‌ ఐటీ’కి సర్వం సిద్ధం

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:08 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యార్థుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది.

‘ట్రిపుల్‌ ఐటీ’కి సర్వం సిద్ధం
ట్రిపుల్‌ఐటీ కళాశాల భవనం

- కళాశాలకు ఎంపికైన 210 మంది విద్యార్థులు

- పాలమూరు రెడ్డి వసతి గృహంలో పూర్తయిన ఏర్పాట్లు

- పర్యవేక్షించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అధికారులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యార్థుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. కార్పొరేషన్‌ పరిధిలోని వీరన్నఫేట సమీపంలో ఉన్న రెడ్డి హాస్టల్‌ భవనంలో, బాసర క్యాంపస్‌ తరహాలో రాష్ట్రంలోనే రెండవ ట్రిపుల్‌ ఐటీ కళాశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఎప్పటికే దరఖాస్తు చేసుకోగా, పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 210 మందిని ఎంపిక చేశారు. వీరందరూ ఆయా కోర్సుల్లో ఆరేళ్ల పాటు విద్యాభ్యాసం చేయనున్నారు. అందులో రెండేళ్ల పాటు ఇంటర్మీడియట్‌ (పీయూసీ-1) నాలుగేళ్లు ఐటీ కోర్సుల్లో (పీయూసీ-2) శిక్షణ పొందనున్నారు. పీయుసీ 1 పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సీఎస్‌ఈ, ఏఐఎంల్‌, డాటా సైన్స్‌ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. అందులో విద్యార్థులకు వారికి నచ్చిన విభాగాలను ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. ఒక్కో కోర్సుల్లో 60 సీట్లు ఉండగా, ఈడబ్ల్యూఎస్‌, స్పోర్ట్స్‌, పీహెచ్‌సీ తదితర కోటాల కింద మరో 10 సీట్లు అదనంగా ఉంటాయి. మొత్తం మూడు కోర్సులో 210 సీట్లను భర్తీ చేశారు. ఎంపికైన విద్యార్థులు గురువారమే కళాశాలకు వచ్చి రిపోర్ట్‌ చేయాల్సి ఉండింది. కానీ వారం రోజుల కురుస్తున్న వర్షాల కారణంగా వాయిదా పడింది. వచ్చే వారంలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కళాశాల పర్యవేక్షకుడిగా వచ్చిన డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.

తాత్కాలిక భవనంలో తరగతులు

ట్రిపుల్‌ ఐటీ కళాశాలకు శాశ్వత భవనం కోసం జిల్లా కేంద్ర సమీపంలోని దివిటిపల్లి, జడ్చర్ల, మల్లబోయినపల్లి పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 43 ఎకరాల భూమిని కేటాయించారు. అక్కడ శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్‌ (రాజా బహద్దూర్‌ వెంకట్‌రాంరెడ్డి కళాశాల) భవనంలో తాత్కాలిక తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తరగతి గదులు, వసతి గృహం, భోజనశాల, ప్రయోగశాల తదితర వసతులను అందుబాటులోకి తెచ్చారు. గరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. ఎంపికైన విద్యార్థుల్లో బాలికలు 144 మంది, బాలురు 66 మంది ఉన్నారు. విద్యాబోధన కోసం 10 మంది అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందిని నియమించారు. ఏర్పాట్లను ఇటీవల ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పర్యవేక్షించారు.

పూర్తయిన ఏర్పాట్లు

ట్రిపుల్‌ ఐటీ తరగతుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. శుక్రవారం నుంచి ఓరియెంటేషన్‌ తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా, వర్షాల కారణంగా వాయిదా వేశాం. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం అందించాం. వచ్చే వారంలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనిపై బాసర ట్రిపుల్‌ ఐటీ వీసీ ఏ గోవర్ధన్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

- డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌, పర్యవేక్షకుడు

Updated Date - Aug 22 , 2025 | 11:08 PM