సకలం బంద్
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:32 PM
స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలంగాణ బంద్ పాలమూరు, నారాయణపేట జిల్లాల్లో విజయవంతం అయ్యింది. ఈ బంద్ తెలంగాణ ఉద్యమం నాటి రోజులను గుర్తుకు తెచ్చింది. బంద్‌తో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి.
బీసీ సంఘాల బంద్‌కు అన్ని పార్టీల మద్దతు
తెల్లవారుజామునే బస్టాండ్‌కు చేరుకున్న బీసీ సంఘాలు, పార్టీల నాయకులు
డిపోలకే పరిమితమైన బస్సులు
ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
స్వచ్ఛందంగా విద్యాసంస్థల మూసివేత
మధ్యాహ్నం తరువాత పాక్షికంగా తెరుచుకున్న వ్యాపార, వాణిజ్య సముదాయాలు
నారాయణపేటలో అన్ని పార్టీల ధర్నాలు
మహబూబ్‌నగర్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలంగాణ బంద్ పాలమూరు, నారాయణపేట జిల్లాల్లో విజయవంతం అయ్యింది. ఈ బంద్ తెలంగాణ ఉద్యమం నాటి రోజులను గుర్తుకు తెచ్చింది. బంద్‌తో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. రహదారులన్నీ నిర్మాణుష్యంగా మారాయి. మహబూబ్‌నగర్‌లో తెల్లవారుజామున 5 గంటల నుంచే బీసీ సంఘాలు, పార్టీల నాయకులు రోడ్డుపైకి వచ్చేశారు. బస్టాండ్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యాసంస్థలు ముందుగానే బంద్‌కు మద్దతుగా పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా మధ్యాహ్నం వరకు మూసివేశారు. ఆ తరువాత సగానికిపైగా దుకాణాలను తెరిచారు. మెడికల్ దుకాణాలు, ఆస్పత్రులను తెరిచారు. ఆటోలు అందుబాటులో ఉన్నాయి. అసలే దీపావళి పంగడ సీజన్ కావడంతో బంద్ కారణంగా వస్త్ర, కిరాణం, మార్ట్ వ్యాపారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొత్తంగా బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలుపడంతోపాటు బంద్‌లో పాల్గొన్నాయి. పోలీ్‌సశాఖ భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. పండగ సమయంలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బంద్ సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎస్పీ జానకి బస్టాండ్ వద్ద బందోబస్తును పర్యవేక్షించారు.
న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలి: బీసీ జేఏసీ నాయకుడు బెక్కెం జనార్దన్
బీసీల న్యాయమైన డిమాండ్ 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాలని బీసీ జేఏసీ నాయకుడు బెక్కెం జనార్దన్ డిమాండ్ చేశారు. ఉదయం 5 గంటలకే బీసీ సంఘాల నాయకులు బస్టాండ్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు మద్దతివ్వడం సంతోషకరమన్నారు. బీజేపీ మద్దతిస్తే సరిపోదని పార్లమెంట్‌లో బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కొరమోని వెంకటయ్య, శ్రీనివా్‌ససాగర్, మున్నూరు రాజు, ప్రభాకర్, గంజిఎంకన్న, సారంగి లక్ష్మీకాంత్, చందూయాదవ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ బైక్ ర్యాలీ, ధర్నా
కాంగ్రెస్ నాయకులు బీసీ జేఏసీ నాయకులతో కలిసి తెల్లవారుజామున బస్టాండ్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి వ్యాపార వాణిజ్య సముదాయాలను మూ యించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మునిసపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, సంజీవ్‌ముదిరాజ్, వినోద్‌కుమార్, ఎన్‌పీ వెంకటేశ్, సిరాజ్‌ఖాద్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్‌లు అమలు చేస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్ కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సీజే బెనహర్, యాదగిరిగౌడ్, ఖాజాపాష, చిన్న, ప్రశాంత్ పాల్గొన్నారు.
ఇచ్చేవాళ్లే ధర్నాలు చేయడం విడ్డూరం: శ్రీనివా్‌సగౌడ్
‘ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్‌లకు చట్టబద్ధత తేవాల్సిన బాధ్యత కాంగ్రె్‌సపై ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్లమెంట్‌లో బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలి. రిజర్వేషన్‌లు ఇవ్వాల్సిన ఈ రెండు పార్టీలే ధర్నాలో పాల్గొనడం విడ్డూరంగా ఉంద’ని మాజీమంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తెల్లవారుజామున 5 గంటలకే బస్టాండ్ ముందుకు వచ్చారు. మాజీమంత్రి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్, గంజి ఎంకన్న, శివరాజు, తాటిగణేష్, ఆంజనేయులు, శ్రీనివా్‌సరెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.
టీడీపీ మద్దతు
టీడీపీ నాయకులు తెలంగాణ బంద్‌కు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్‌లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బి చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతయ్యల పాల్గొన్నారు.