ప్రమాదమని తెలిసినా.. మారని తీరు
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:23 PM
ప్రస్తుతం పంట చేతికొచ్చింది. ధాన్యం ఆరబెట్టేందుకు ప్రమాదమని తెలిసినా.. రైతులు ఆయా గ్రామాల సమీపంలోని ఆర్‌అండ్‌బీ రహదారుల బాటపట్టారు.
- వరి కల్లాలుగా సర్వీస్ రోడ్లు
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మూసాపేట, చిన్నచింతకుంట ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం పంట చేతికొచ్చింది. ధాన్యం ఆరబెట్టేందుకు ప్రమాదమని తెలిసినా.. రైతులు ఆయా గ్రామాల సమీపంలోని ఆర్‌అండ్‌బీ రహదారుల బాటపట్టారు. రోడ్డుపై ధాన్యం త్వరగా ఆరబెట్టవచ్చని, వర్షం వచ్చినా.. బురద ఉండదని రైతులు చాలా వరకు జాతీయ రహదారి సర్వీస్ రోడ్లపై ధాన్యం ఆరబెడుతూ కల్లాలుగా వాడుతున్నారు. మూసాపేట మండలం జానంపేట, కొమిరెడ్డిపల్లి సర్వీస్ రోడ్డుపై, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్, మద్దూరు, దమాగ్నాపూర్, లాల్‌కోట, వడ్డెమాన్ గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున రైతులు ధాన్యం రోడ్డుమీదే ఆరబోస్తున్నారు. చాలా వరకు ధాన్యం ఆరబోయడంతో ప్రయాణికులు, వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వర్షం వస్తే తడిచిపోకుండా నల్లటి కవర్లు కప్పి ఉంచడంతో రాత్రి వేళ వాహనదారులకు ఆగుపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో సంబంధితశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.