Share News

ఏళ్లు గడిచినా.. రోడ్డు వేయరా

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:26 PM

మండలంలోని పెద్దతండాకు గత ప్రభుత్వ హయాంలో చౌదరిపల్లి నుంచి కుచ్చమీదితండా వరకు టీఎఫ్‌సీ నిధులు రూ.25 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఏళ్లు గడిచినా.. రోడ్డు వేయరా
బురదమయంగా మారిన రోడ్డు

- గత ప్రభుత్వ హయాంలో పనులకు శంకుస్థాపన

- ఇటీవల కురిసిన వర్షాలకు గండిపడిన పెద్దతండా రోడ్డు

మహమ్మదాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పెద్దతండాకు గత ప్రభుత్వ హయాంలో చౌదరిపల్లి నుంచి కుచ్చమీదితండా వరకు టీఎఫ్‌సీ నిధులు రూ.25 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2018 మార్చిలో అప్పటి మంత్రి లక్ష్మారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ ఆ రోడ్డుకు ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారినా తమ తండాకు బీటీరోడ్డు మాత్రం వేయడం లేదని తండావాసులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చౌదర్‌పల్లి, పెద్దతండాకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న బిడ్జి పక్కన రోడ్డు కోతకు గురి కావడంతో పరిస్థితి మరీ ఇబ్బంది కరంగా మారింది. దీనికి తోడు రోడ్డుపై గుంతలు ఏర్పడి వర్షపు నీరు చేరడంతో కుంటలను తలపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో తండావాసులే బ్రిడ్జి దగ్గర కోతకు గురైన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి బీటీ రోడ్డు పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:26 PM