ఉపాధి హామీకి తూట్లు
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:05 PM
పేద ప్రజలకు స్థానికంగా పనులు కల్పించి, వలసలను నివారించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తోంది. పథకంలో నెమ్మదిగా మార్పులు చేస్తూ, రానురాను పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం పని దినాల్లో 50 శాతం కోత..
గతేడాది ఇచ్చింది 32.43 లక్షల పని దినాలు.. ఈ ఏడాది ఇచ్చింది 17.78 లక్షలే
అందులో ఇప్పటికే 70 శాతం అంటే 12.54 లక్షల పని దినాలు పూర్తి
సిబ్బందికి ఇవ్వని టార్గెట్లు
పథకాన్ని నీరుగారుస్తున్న కేంద్ర ప్రభుత్వం
పేద ప్రజలకు స్థానికంగా పనులు కల్పించి, వలసలను నివారించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తోంది. పథకంలో నెమ్మదిగా మార్పులు చేస్తూ, రానురాను పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అడిగిన వారందరికీ పనులు కల్పించడమే ఈ పథక ఉద్దేశ్యం కాగా, పనిదినాలు తగ్గించడం, సిబ్బందికి టార్గెట్‌ల ఊసే లేకపోవడం, మెటీరియల్ పేమెంట్‌లు ఇవ్వడంలో తాత్సారం చేయడం అందుకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు పథకాన్ని కొనసాగిస్తారా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- మహబూబ్‌నగర్, (ఆంధ్రజ్యోతి)
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం పని దినాలను 50 శాతం తగ్గించింది. దాంతో పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 32.43 లక్షల పనిదినాలు కల్పించగా, 32.69 లక్షల పని దినాలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను కేవలం 17.78 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించడం గమనార్హం. గడిచిన ఐదేళ్లలో ఇంత తక్కువ పని దినాలు కల్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అదే 2023-24లో 31.05 లక్షల పని దినాలు కేటాయించగా 35.13 లక్షల పని దినాలు చేశారు. 2022-23లో 28.06 లక్షల పని దినాలకు 31.68 లక్షలు, 2021-22లో 35.97 లక్షల పనిదినాలకు 36.89 లక్షలు, 2020-21లో 41.86 లక్షల పనిదినాలకుగాను 40.44 లక్షల పనిదినాలు చేశారు.
ఇప్పటికే సగానికిపైగా పూర్తి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడిచింది. ఇప్పటికే కేటాయించిన పని దినాల్లో 12.54 లక్షల పని దినాలు అంటే 70.52 శాతం పూర్తి చేశారు. మరో ఎనిమిది నెలల సమయం ఉండగా మిగిలిన 5 లక్షల పని దినాలు సరిపోవన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో పనులు తక్కువగానే జరుగుతాయి. సమ్మర్ సీజన్ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పెద్ద ఎత్తున పనులు సాగుతాయి. అప్పుడు వ్యవసాయ పనులు ఉండవు. కాబట్టి కూలీలు ఎక్కువ సంఖ్యలో పనులకు వస్తారు. ఇక మిగిలిన 5 లక్షల పని దినాల్లో జనవరి నాటికి మరో 2-3 లక్షల పనిదినాలు చేస్తే వేసవికి ఇక పనిదినాలేవీ మిగలవని కూలీలు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూ డా ఈ సమస్యను గుర్తించి పనిదినాలు పెంచాలని కేంద్రానికి లేఖ కూడా రాసింది.
అధికారులకు విధించని టార్గెట్‌లు
పథకంలో గతంలో సిబ్బందికి గ్రామానికి 100 మందికి తగ్గకుండా పని చేయాలని లక్ష్యాలను నిర్దేశించేవారు. ఈ లెక్కన జిల్లాలో రోజూ 40-50 వేల మంది పని చేయాల్సి ఉం డగా ప్రస్తుతం 1,200 నుంచి 1,500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ నెలకు 3,000 పనిదినాలు, టెక్నికల్ అసిస్టెంట్ తన పరిధిలోని 7,500 పని దినాలు చేయిస్తేనే జీతాలు చెల్లించాలన్న నిబంధన ఉం డేది. ఫీల్డ్ అసిస్టెంట్‌లు తక్కువ పనిదినాలు చేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి సీనియర్ మే ట్‌కు డిమోట్ చేసేవారు. ఇప్పుడవన్నీ బుట్టదాఖలయ్యాయి. కేవలం వన మహోత్సవం కార్యక్రమాలకే పథకాన్ని పరిమితం చేశారు. కావాల్సిన పనులు చేయడానికి వీలు లేకుండా కోత విధిస్తోంది. భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా పనులు చేయిస్తున్నారు. ఫాంపాండ్, ఫీడర్ ఛానల్, ఫీల్డ్ చానల్, షిల్ట్, పశువుల షెడ్ల పనులకే పరిమితం చేశారు.
కూలీ గిట్టుబాటు కోసం ఒత్తిడి
ప్రస్తుతం కూలీకి రోజూ కొలతలను బట్టి రూ.307 కూలీ చెల్లించవచ్చు. అయితే కొలతల ప్రకారం అంత కూలీ గిట్టుబాటు కావడం లేదు. పనిదినాలు తక్కువగా ఉన్నందున కూలి గిట్టుబాటుకోసం చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. డబ్బులు పెరిగితే కూలీలు సంతృప్తి చెందుతారన్న ఎత్తుగడ కూడా కావచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు సగటున రూ.239.61 కూలీ పడింది. గడిచిన ఆరేళ్లలో ఇదే ఎక్కువ కావడం విశేషం. 2024-25లో సగటున రూ.210, 2023-24లో రూ.190.63, 2022-23లో రూ.179.85, 2021-22లో రూ.189.34 కూలీ పడింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.50.95 కోట్లు కూలీలకు చెల్లింపులు చేశారు. మెటీరియల్ పేమెంట్ రూ.31.15 కోట్లు కాగా రూ.10 కోట్ల వరకు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి.