హక్కుల పరిరక్షణకు కృషి
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:18 PM
బాలల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి సూచిం చారు.
- బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌సీతా దయాకర్‌రెడ్డి
- సభ్యులతో కలిసి వనపర్తి, శ్రీరంగాపూర్‌లలో పర్యటన
- అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ, అధికారులతో సమీక్ష
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూలై3 (ఆంధ్రజ్యోతి) : బాలల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కంచర్ల వందన గౌడ్, మరిపల్లి చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్‌లు గురువారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. శ్రీరంగాపూర్ గ్రామం లోని అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వనపర్తి పట్టణంలో బాల సంర క్షణ కేంద్రం, బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌లతో కలిసి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం అందించి, వారికి అనా రోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్ర్తీ, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలపై ఉందన్నారు. చిన్నారుల కోసం అంగన్‌వాడీల్లో ఇచ్చే బాలా మృతంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహాలు, బాల కార్మికుల కేసుల వివరాలను సంబంధిత శాఖల అధిఆరులను అడిగి తెలుసుకున్నారు. కనీస మౌలిక వసతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేసి, తీసుకున్న చర్యలపై నివేదిక పంపించాలని సూచించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో వయసుకు తగిన బరువు, ఎత్తు లేని పిల్లలను ఎన్‌ఆర్‌సీ కేంద్రానికి పంపిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు అవసర మైన వైద్యం, పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్యవంతులను చేస్తున్నట్లు తెలిపారు. అనాథ పిల్లలకు మెరుగైన విద్యను అందించడంతో పాటు, వారికి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలను పంపించినట్లు చెప్పారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే కచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పోక్సో కేసులో చార్జిషీట్ నమోదు చేయడమే కాకుండా, బాధితులకు సకాలంలో పరిహారం ఇప్పించడం, సపోర్టు పర్సన్‌ను నియమించి వారికి తగిన ధైర్యం, సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీసీపీవో రాంబాబు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.