పులిమామిడి గ్రామ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:08 PM
మండలంలోని పులిమామిడి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

- మంత్రి జూపల్లి కృష్ణారావు
ఊట్కూర్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పులిమామిడి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని పులిమామిడి గ్రామ రామలింగేశ్వరస్వామిని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్‌లు పెద్దసూరయ్యగౌడ్, చిన్నసూరయ్యగౌడ్, గ్రామస్థులతో కలిసి రామలింగప్ప దేవాలయం గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే, మండలంలో రెండో పెద్ద గ్రామంతో పాటు అన్ని వసతులు ఉన్న పులిమామిడి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని వారు కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే, ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రామలింగేశ్వర స్వామి గుట్టపైకి వెళ్లడానికి రోడ్డు వ్యవస్థను ఏర్పాటు చేస్తానని అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, బీకేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజ్ఞేశ్వర్‌రెడ్డి, నాయకులు శంకర్, శివరామరాజు, నరేష్, అధికారులు పాల్గొన్నారు.
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి
మక్తల్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాస గృహం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావుకు వీఆర్‌ఏలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు రవి, వెంకట్‌లు మాట్లాడుతూ 61ఏళ్లు నిండిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, జీవో నెం.81 ప్రకారం డిగ్రీ చదివిన వారిని జూనియర్ అసిస్టెంట్‌లుగా, ఇంటర్ పూర్తిచేసిన వారిని రికార్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలన్నారు. కార్య క్రమంలో జూనియర్, రికార్డ్ అసిస్టెంట్, వీఆర్‌ఏలు ఆవుల శ్రీనివాసులు, మేట్ల కురుమయ్య, వై.కురుమూర్తి, నర్సిములు, సిద్దు, బాలకిష్టప్ప తదితరులున్నారు.